పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/261

ఈ పుట ఆమోదించబడ్డది

కవులు భిక్షాటకులేనా?

265

“అజ్భిన్నం పరేణ సంయోజ్యం" అన్నట్టు స్కూలులో వుండఁగానే యెవరో స్వయంవరంగా పరిగ్రహించడం తటస్థించే యెడల తండ్రి వరాన్వేషణానికని, హైస్కూళ్లూ కాలేజీలూ పరిశీలించడానికి ఆయా తరగతుల టీచర్లనీ, లెక్చెరర్లనీ ఆశ్రయించడం బాధ నూటికి 99 పాళ్లు తప్పిపోతుందని సంతోషించవచ్చు ననుకుంటాను. అప్పడల్లా వివాహంచేస్తే సరిపోతుంది. కుల గోత్రాదులు పెట్టుకోనక్కఱలేదు. ఆ యీ పద్ధతి అమల్లోకే వస్తే గేస్తులు కణ్వమహర్షులుగా పరిణమిస్తారు. యిది మన భారతదేశాచారమేకాని ఖండాంతరాచారం కాదనడానికి శకుంతలాసతియే చాలును. శారదాబిల్లు వచ్చి అయిదురోజుల పెళ్లిని వొకరోజులోకి తెచ్చింది గాని ఆవొకరోజేనా యేవో మంత్రాలు తంత్రాలూ మంగళ వాద్యాలూ చుట్టాలూ పక్కాలూ భోజనాలూ పిండివంటలూ యింకా తప్పడంలేదు, యీ పిమ్మట లోcగడ వుదాహరించిన క్వాలిఫికేషన్సు పద్ధతి అమల్లోకి వస్తే "కరగ్రహః ప్రథమమభియోగః" అన్న గోవర్ధనాచార్యుల సప్తశతిశ్లోకమే పురోహిత స్థానాన్ని అలంకరిస్తుంది.

మన నాగరికత "ప్రతిక్షణ విజృంభణాదుభయ బాహుకూలం కషస్తనత్రుటిత కంచుకం నమత యావనం యోషితామ్” అన్నరీతిని విజృంభించడం చాలా అభినందనీయం. యీ సందర్భమేనా నిర్బంధ కట్నాలను వారిస్తే బాగుండును. కొన్ని శాఖలలో విద్యనిబట్టి, ధనాన్ని బట్టి, భూమినిబట్టి గౌరవాన్నిబట్టి కట్నాల తారతమ్యం వుంటుంది. కొన్ని శాఖలలో విద్యాదులేమీ ఆవశ్యకంలేదు. పెండ్లి కొమారుఁడు, అనేడు ప్రత్యయానికే అట్లీస్టు నాలుగువేలు పయిగా చెల్లించాలి. ఆయీ మహాఘోరం యిరవయ్యో శతాబ్దారంభాన్నుంచి మొలకెత్తింది. యిప్పుడు బాగా పెరిఁగిపోయింది. యీ కట్నం అడగడంలో అడగనట్లు అభినయించే వారు కొందఱు. మచ్చు చూపుతాను, ఒక వియ్యాలవారంటారు కదా? “అయ్యా! మాకు యేమీ కట్నంతో అవసరంలేదు. ఉభయఖఱ్చులు పెట్టి పెండ్లి సలక్షణంగా చేసి పంపండి. అల్లుఁడు కట్నం కోరలేదు గనుక పెండ్లికూఁతురుకు నగలు పెట్టండి. మీరే మీ పిల్లకు నగలు పెట్టుకోండి." యిది కవుల భిక్షాటనానికంటే కూడా పైతరగతిలోకి దేఁకుతుంది. యేదో వ్రాస్తూ దేనిలోకో వచ్చాం. అసలేమో వ్యాసం కవుల భిక్షాటనాన్ని గుఱించి ఆరంభం. ముగించే సమయానికి గాయకులు వచ్చి కలిశారు. అంతలో నేcటి పెండ్లి కట్నాలు వచ్చి కలిశాయి. మంగళాంతంగా వ్యాసం ముగించడం శ్రేయః ప్రదమే కదా! కవులు భిక్షాటకులు కారని సమర్ధించడానికి కలం చేతఁబట్టినా తుదకు అభీష్టార్థసిద్ధి కాలేదనుకుంటాను. భిక్షాటకులు కాకపోతే రసజ్ఞ లోకానికి మంచి కవిత్వం వుదయించదు, యేమంటారా? ఆపక్షంలో కవి యిల్లు కదలనే కదలఁడు. అప్పుడు-