పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/244

ఈ పుట ఆమోదించబడ్డది

248

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

 వెనక “ఆంధ్రకవుల అపరాధాలు” అంటూ బయలుదేరితే ఊరుకున్నారా యెంతవఱకు చేయాలో అంతవఱకున్నూ చేశారుగదా? యీ వ్యాసకవిగారు యేదో వక విధమైన కవిత్వం లోకాన్ని వుద్ధరిస్తుందనే నమ్మకంకలవారుగా వారి వ్యాసాంత మందలి యీ కింది వాక్యంవల్ల తేలుతుంది దాన్ని వుదాహరించి రెండు మాటలు వ్రాసి ముగిస్తాను.

"కుక్కలు మొరుగుతూనే వుంటాయి. ఏనుఁగులు పోతూ వుంటాయి. అని దాని అభిప్రాయం. ఇదే ప్రకృతి విరుద్ధం అయిన కవిత్వమంటే? ఇల్లాంటి కవిత్వమే మన హిందూదేశం ఇంత నీచస్థితిలో వుండడానికి కారణం."

యీ వాక్యం ఆయన యేలాటి కవిత్వాన్ని మనసులో పెట్టుకొని వ్రాశారో? చట్టన గోచరించకపోయినా ఆయనకి యేమాదిరి కవిత్వ మందో ఆదరాతిశయం వుందనిమాత్రం తెలుపుతుంది. దీన్నిబట్టి కవిబాంధవులని తేలుతుంది. ఆలాటి కవిత్వాన్ని యిప్పటి కవులలో వకరు కాకపోతే మరివకరేనా చెప్పకపోవడంచేత పట్టరానికోపం వచ్చి కవులందఱినిన్నీ కుక్కలుగా చేసే కృతకృత్యులైనట్టున్నూ పత్రికవారు దీని తత్వాన్ని అశ్రద్ధవల్ల పరిశీలించక లోకానికి అందించినట్టున్నూ నాకు తోస్తుంది. యీ విషయం అంత అత్యావశ్యకమే అయితే వ్యాసకర్తగారు స్వయంగానే ప్రకటించుకొనేవారు. ఆలా ప్రకటించుకోతగ్గ దీన్ని పత్రికవారుపేక్షిస్తే కొంత బాగుండేదేమోనని నేననుకున్నాను. యీ వ్యాసకర్తగారు తమ పేరును వుదాహరించే వున్నారుగాని అల్లా వుదాహరించినా "ఫలానా" అని నాకు గోచరించలేదు. కాని సుప్రసిద్దులై వుంటారన్నది మాత్రం నిర్వివాదాంశం. యీవ్యాసం వ్రాయడంలో వారికివున్న అంతరంగాభిప్రాయం యెట్టిదో తెలిపితే సంతోషం, లేదా అంతకంటే సంతోషం. యెంత సవిమర్శంగా దీన్ని చదివిచూచినా యిది కుక్కలకే సంబంధించిన వ్యాసంగా మాత్రం నాకు తోcచడంలేదు. కుక్కలు ఆ మాదిరిగా మొరగడాన్ని గూర్చి లోకానికి తెలపవలసినంత అవశ్యకత వుంటుందని తోఁచదు. అది సర్వసామాన్యమైన విషయం. వ్యాసమన్నప్పుడు అందులో యేదో కొత్త విషయం వుండి అది తాను మాత్రమే కనిపెట్టిందయితే “ఏకస్స్వాదు న భుంజీత" అనే న్యాయాన్ని బట్టి యితరులకు కూడా ఆ మహా రహస్యాన్ని బోధించే తలంపుతో పత్రిక కెక్కించవలసి వుంటుంది. అట్టి రహస్యం దీనిలో వుంటే వ్యాసకర్తగారు తెలుపుతారని తలుస్తాను.


★ ★ ★