పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

27


వీరి విద్యావంశమే అనడంలో లేశమున్నూ అతిశయోక్తి వుండదు. యెనభై సంవత్సరాలకు మించిన వయస్సులో వీరి దర్శనం నేను చేసివున్నాను. వీరున్న సభలో అవధానంకూడా చేయడం తటస్థించింది. ఆ సభలో వీరినిగూర్చి రచించినదే యీ శ్లోకం -

శ్లో. శ్రీమద్భాగవతాన్వయాంబుధి విధూరాజత్కలాపాలకః
పాణిన్యుప్తసుదర్శనశ్చ విబుధారాధ్యాంఫ్రిు యుగ్మాంబుజః
సత్యాసక్తహృదంతరో నిరుపమ శ్చానంతగోవర్ధనః
పాయా దేష హరి ర్యథా సచ హరిస్సర్వాఘ విధ్వంసకః!

ఈ శ్లోకంలో శ్రీకృష్ణునకును హరిశాస్తుల్లుగారికిన్నీ విశేషణాలు సమంగా అన్వయించుకోవాలి. యీలాంటి మహాపండితులు యెందరో వుండే ఆ కాలం యిక మనకు రాదనుకుంటాను. దానికి ముఖ్యకారణం నూటికి ముప్మె అయిదో నలభయ్యో మార్కులతో శిరోమణులూ ఉరోమణులూ బయలుదేరడానికి అవకాశంకూడా యేర్పడ్డది. వెనకటివాళ్ల పాండిత్యాలంటే యేలాటి దీక్షతో సంపాదించుకొన్నవో వక వుదాహరణ మచ్చుకు యిక్కడ చూపిస్తాను, పరిశీలించండి.

ముంగండ కాపురసులు శ్రీ పుల్లెల దక్షిణామూర్తిశాస్రులుగారు కాశీలో శ్రీ జాగేశపండిట్జీ వారివద్ద చిరకాలం విద్యాభ్యాసంచేసి గృహస్థాశ్రమాని కభిముఖులై వస్తూ వస్తూ తోవలో కొన్ని సంస్థానాలలో పాండిత్య ప్రకటనం చేసుకొంటూ మాడుగుల ప్రభువు కృష్ణభూపతి దర్శనానికేమో వెళ్లారంట. అక్కడ భాష్యమంతా సంధ్యావందన ప్రాయంగా కంఠపాఠముగానున్న శ్రీ యింద్రగంటి గోపాలశాస్రుల్లు గారితో వాదంవచ్చి ఎక్కడో వోడు తటస్థించిందనిన్ని దానితో మళ్లా వెనక్కి తిరిగి కాశీ వెళ్లి పదిపండ్రెండు సంవత్సరాలు కృషిచేసి గోపాలశాస్రుల్లు గారిని జయించే తలంపుతో మాడుగుల సంస్థానానికి వచ్చారనిన్నీ అప్పటికి సదరు గోపాలశాస్రుల్లుగారు స్వర్గస్టులవడంచేత "అయ్యో మనకోరిక తీరకపోయెనే” అని దక్షిణామూర్తిశాస్రుల్లుగారు విచారించారనిన్నీ వినికి. ఆయీ కథలవల్ల అప్పటి పాండిత్యాలకున్నూయిప్పటి పాండిత్యాలకున్నూ వుండే తారతమ్యాలు తెలుస్తాయని కొంచెం వుదాహరించాను.

ప్రస్తుతం కథానాయకులలో ఒకరైన గోపాలశాస్రుల్లుగారు చాలా గొప్పవారని విని మన పిఠాపురం రాజావారు వీరికిన్నీసుబ్బత్రయంలో వకరైన శ్రీ తణికెళ్ల సుబ్బన్నశాస్రుల్లు గారికిన్నీ శాస్తార్ధంపెట్టి జయాపజయాలు చూద్దామనే కుతూహలంతో సబహుమానంగా రప్పించారంట. సుబ్బత్రయమంటూ వకమాట వ్రాసివున్నాను. నవద్వీపాన్నుంచి తర్కం చదువుకొని వచ్చినవారిలో ముగ్గురుపండితులు మన తెలుగుదేశపువారు సుబ్బన్న లేక,