పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది

216

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కాలక్షేపం చేస్తారు. వారికి దీనితో పనేముంటుందని చెప్పడానికి? వేదపురుషుఁడు జాతాశౌచామృతాశౌచాలతో సంబంధం కల్పి, యెంత చక్కగా చమత్కరించాఁడో, యింతకంటే, రసవత్తరంగా కాళిదాసాదులు చెప్పఁగలరా? (బాణోచ్చిష్టమా, యీ జగత్తు వేదోచ్ఛిష్టమా?) దీన్ని బీజంగా వుంచుకునే అనుకుంటాను లీలాశుకుడు,

శ్లో. “సంధ్యావందన భద్ర మస్తుభవతే...
     స్మారంస్మార మఘం హరామి"

అన్నాఁడు. సర్వకాల సర్వావస్థల యందున్నూ, భగవన్నామాన్ని మనన చేసేవాళ్లకోసం సంధ్యావందనాదికం పుట్టలేదన్నది పరమార్థం. దాన్నే వేదపురుషుడు (ఆదిమకవి) పూర్వోక్తరీత్యా చమత్కరించాడు. సాహిత్య రత్నాకరకర్త అలంకారాలన్నిటికీ వేదంలోనే బీజాలు వున్నాయని వ్యాఖ్యానించాఁడు యీ ఘట్టంలోదే యిదిన్నీ

శ్లో. "హృదాకాశే చిదాదిత్య | స్పదా భాసతి భాసతే.
      నా౽స్తమేతి నచోదేతి | కథం సంధ్యా ముపాస్మహే?” -

సంధ్యావందనానికి యేర్పఱచిన కాలమేమోసూర్యోదయ సూర్యాస్తమయాలు. స్థూలదృష్ట్యా కనపడే సూర్యుఁడికి ఉదయాస్తమయాలువుంటే వున్నాయిగాని, జ్ఞానసూర్యుఁడు హృదయమనే ఆకాశమందు సర్వకాల సర్వావస్థలయందూ వొకటే విధంగా ప్రకాశిస్తూ వుంటే, సంధ్యావందనం చేయడం యేలాగ? అన్నాఁడు. వెనకటి శ్లోకానికీ దీనికీ రచనలో కొంచెం భేదం కనపడుతూ వున్నా తాత్పర్యంలో భేదంలేదు. అవ్వాగుఱ్ఱమూ వకటే. (ప్రమాణానా మనేకత్వే౽పి ప్రమేయస్యైకత్వాత్) కొన్ని శ్లోకాలు కొంత మార్పుతోనున్నూ కొన్ని యథామాతృకంగా నున్నూ ఋషులు (కాళిదాసాదులు కూడా) అనువదించుకున్నారు.

శ్లో, “మన ఏవ మనుష్యాణాం | కారణం బంధమోక్షయో"

యిది అమృతబిందూపనిషత్తులో యేలావుందో, భగవద్గీతలోనూ ఆలాగే వుంది.

శ్లో, "యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాః,
      తదా శివ మవిజ్ఞాయ | దుఃఖస్యా౽న్తో భవిష్యతి"

యిది శ్వేతాశ్వతరోపనిషత్తులో ఏలావుందో, దేవీభాగవత సప్తమ స్కంధంలోనూ, ఆలాగే వుంది. ధర్మాన్ని చుట్టచుట్టి (చంకని పెట్టుకొన్నట్టన్నమాట) నట్టు ఆకాశాన్ని చుట్టగా చుట్టగలిగినవాళ్లకు శివపరిజ్ఞానం లేకుండానే దుఃఖనివృత్తి కలుగుతుంది అని దీని అర్థం. తాత్పర్యమో, అది యేలా అసంభవమో; యిదిన్నీ ఆలాగే అసంభవం అని తేలుతుంది.