పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

175


సహాయం కలిగినట్లు కనిపించదు. యిప్పుడల్లా “పూర్వాచారాలు దుష్టాలు. ఆకట్టుఁబాట్లను యేర్పఱచిన ఋషులు మూర్ఖులు" అనేతోవలో వాక్కునుగాని, లేఖినినిగాని నడిపిస్తే దానికి యెంతవిలువవుండాలో అంతవిలువా వుంటుంది. నవీనమార్గాలనుగూర్చి యేమాత్రం కాదన్నా వాఁడిమీదికి లేచి యేంచేసినా ప్రపంచకం చేసిందన్న మాటే! యీ స్థితంతా తెలిసివుండీ కూడా దేవతోద్దేశకంగా సేవ నిమిత్తం పూర్వపు మహారాజులు వగైరా పరలోకంలో వుత్తమ గతి సంపాదించుకొనే వుద్దేశంతో యిచ్చిన మాన్యాలు వృథాగా పోవడాన్ని గురించి పూర్వ గ్రంథానుసారంగా యేవో కొన్ని మాటలు నేను వ్రాసివున్నాను. అవేనా నాఅంతట నేను వ్రాయలేదు; కొందఱు యోగ్యులు వ్రాయవలసిందిగా కోరితే నే వ్రాశాను. ఆ వ్రాయమన్న వారిపేళ్లు యిందుదాహరిస్తే యిప్పుడు నన్ను దూషించిన మహావ్యక్తి వారిని కూడా దూషించడానికి వెనుతీయడు కనక వుదాహరించలేదు. యిప్పుడు వారువారు తొక్కేమార్గాలు యెంత వఱకు నెగ్గుతాయోకాని, ప్రస్తుతం యెందఱికో యెన్నో విధాల నష్టాన్ని కలిగిస్తూవున్నాయి. వకటి వుటంకిస్తాను.

సుమారు యిరవైయైదేళ్లనాఁడు శృంగారగ్రంథాలు బహిష్కరించవలసిందని వొకరు కొందఱి సహాయంతో గవర్నమెంటులో రూలొకటి పుట్టించారు. అది యెందఱికో యెన్నో విధాల బాధించింది. తుదకవి నిషేధించబడ్డాయేమో అంటే అన్నీ అమ్ముతూనేవున్నారు. యెవళ్లోభయస్టులు మాత్రం ఆ నష్టిని అనుభవిస్తూ వున్నారు. యిప్పుడు మళ్లా ఆ నిషేధం తొలంగించడానికి పెద్దపెద్దలు ప్రయత్నిస్తూ వున్నారు. ఫలితం యేమవుతుందో? తెలియదు. మొదట ఆ ప్రయత్నం యెందుకు? ఇప్పుడు యీ ప్రయత్నం యెందుకు? శారదాబిల్లంటూ వకటి పుట్టించారు. అది పట్టినపిమ్మట బాల్యవివాహాలు మఱీ చెలరేగుతూ వున్నాయి. ఆలాగని యే పిచ్చి బ్రాహ్మఁడేనా తప్పులేదు కాఁబోలు నని బాల్యవివాహం చేశాఁడా యే సంఘసంస్కర్తలో కాస్త కలిగించుకుంటారు. వాఁడి హవిష్యమూ, భవిష్యమూ తీసిపాఱవేస్తారు. దేవదాస్యానికి ఏర్పడ్డ మాన్యాలేమో బిల్లు ద్వారా క్షణంలో అంతరించాయి. యెందుకోసం యీఅంతరించడం కావలసివచ్చిందో ఆకార్యం ఏమాత్రమూ కొనసాఁగినట్టు లేదు! పోయినట్టు లేదంటావు గదా! ఋజువుచేస్తావా? అని ప్రశ్నవస్తుంది. అది యెవడి శక్యం? ప్రభుత్వంవారికి జాతిమత భేదంతో అవసరం లేదనే రహస్యం యెప్పుడైతే ప్రపంచానికి సర్వేసర్వత్ర గోచరించిందో అప్పుడు యేదో సంఘ మంటూ పేరుతో బయలుదేఱి వారివారికోరికలను తీర్చుకోవడానికి ప్రపంచం ప్రయత్నిస్తూ వున్నట్టు తోస్తుంది. నాట్యకళకోసం దేవదాసీ లనిమాత్రమే అక్కఱలేదు. మరివకళ్లయినాసరే స్వతంత్రం కలవాళ్లుండాలని నేను వ్రాస్తే వొకావిడ నన్ను ఎన్నో ఆడిపోసింది. దానిలో బోలెఁడు శ్లేషలు! స్వాతంత్ర్యం స్త్రీలకి సర్వేసర్వత్ర వుండాలని మళ్లా యెందఱో యెన్నో వ్యాసాలు