పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది

కళలకోసరం దేవదాసీజాతి

173


మని చెప్పినట్లే వాళ్లున్నూ చెపుతారు. అందఱూ సానులుగానే వుండాలనే నియమంగాని, నిర్బంధంగాని లేదు- సంఘ సంస్కర్తలు ఆయీ జాతి స్త్రీలకు పెండ్లి చేసుకొనే అధికారాన్ని కొత్తగా కల్పించలేదు. ఆ అధికారం అనాదిగానే ఆ యీ జాతికి వుంది. యిప్పుడల్లా దేవాలయాల నౌకరీమాత్రం తప్పించినట్టయింది. పయిఁగా సంగీతకళనున్నూ దానిలోనే అంతర్భూతమైన నాట్యకళ నున్నూ నిర్మూలించడానికి సంకల్పించినట్టు పరిణమిస్తూంది - యే కొంచెమో యీ కళలు సంసారులవల్ల అభ్యసింపఁబడినా ప్రత్యేకించి యిందుకోసం వక జాతి అంటూ వుంటేనే తప్ప యీ కళలు నశించిపోక తప్పదు. వ్యభిచారం నశింపచేయడానికి బ్రహ్మక్కూడా తరంగాదు. వేశ్యాజాతి దాన్నిన్నీ దేవాలయాల్లో నాట్యాలున్నూ మానివేసినంతలో లోకంలో వ్యభిచారం నశిస్తుందన్న మాట సర్వకల్ల - కాఁబట్టి సంగీతంకోసమున్నూ అభినయం కోసమున్నూ యీజాతి వకటి వుండడానికి అంగీకరించడం యుక్తమే అని నేననుకుంటాను- దుర్నీతి విషయంలో యితర దేశాలలో కంటే మనదేశంలో సదుపాయాలు తక్కువగానేవున్నాయని ఋజువుచేయడం మిక్కిలీ సుళువు. గానాభినయాలకోసమంటూ వకజాతి రిజర్వు చేయఁబడ్డదై ఉన్నంతమాత్రంచేత దుర్నీతి హెచ్చడానికి అది ఉపోద్బలకంకాదు. జారత్వ చోరత్వాలు రెండున్నూ వకటే తరగతిలోవికదా! జారత్వానికి మనదేశంలో వకజాతి యేర్పడి వుందే అనుకుందాం, చోరత్వానికి పెద్దలచేత అలా యేర్పఱచఁబడి లేదుకదా? లేనప్పడు అది యెందుకు వృద్ది పొందాలి? యీ రెండున్నూ నశించవలసివస్తే జ్ఞానంవల్లనేతప్ప “అన్యథా శరణం నాస్తి".

సంగీతమున్నూ అభినయమున్నూ అవసరమైన కళలే అని అంగీకరించే యెడల యిదివఱకువున్నవేశ్యాజాతి కాకపోతే మానెఁగాని యింకో జాతినేనా స్త్రీజాతిని స్వతంత్రమైన దానిని దానికోసం రిజర్వు చేసి పెట్టడం అవసరమనియ్యేవే. సంసారిణులవల్ల మాత్రం ఆ కళలు యే కొంచెమో నామమాత్రావశిష్టంగా నిలిచి కొనవూపిరితో నిల్వఁగలిగినా పూర్ణవికాసాన్ని పొందడంమాత్రం పుస్తకాపేక్షే అని నా తలంపు. “యీ కళలే అక్కఱలేదు, వీట్లవల్ల కలిగే ప్రయోజనం లేనేలే దంటారా? అట్టి వారికి చెప్పవలసిన జవాబేలేదు - వకవేళ - శ్లో, సంగీతసాహిత్య రసా౽నభిజ్ఞ స్సాక్షాత్పశుః పుచ్చవిషాణ శూన్య" అంటూ అభియుక్తులు పూర్వం చెప్పివున్నారని నేను ఉదాహరించినా అట్టివారు అఅక్షణంలో దాన్ని ఖండిస్తారని యెఱుఁగుదును. వొక మంచికోసం యింకో చెడ్డని అంగీకరించ వలసివస్తూ వుంటుందని వేఱే వ్రాయనక్కఱలేదు.


★ ★ ★