పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/160

ఈ పుట ఆమోదించబడ్డది

164

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వుపకారంకంటె అపకారాన్ని యెక్కువచేసినట్టు కనపడుతూ వుందంటాను. నేడో, రేపో - మన భారతదేశం క్షామదేవతకు గుఱికావలసి రావడం ఆయీ సాధనాలలో రైలుమూలాన్నే అని తోస్తుంది. దీని బారినుండి తప్పించుకోడానికి కొందఱు చెప్పే వుపాయం - ముఖ్యంగా సంతాన నిరోధము. ఆ వుపాయము చెప్పినవారు పాశ్చాత్యులే. ఆ వుపాయము వల్ల పుట్టబోయే సంఖ్య తగ్గుతుంది. కాని యిప్పటికే పుట్టిన వాళ్లగతేలాగ? రైతులకు నాలుగు డబ్బులు కనపడడమే కావలసింది. షావుకార్లకు వర్తక లాభమే కావలసింది. యింకో విశేషం : వీరికి రేపు కూడులేక చచ్చేవాళ్లలో మనంకూడా భాగస్వాములం కావలసి వస్తుందనే వివేచన వున్నట్టే లేదు. రైతు తనమట్టుకు నిలవచేసుకుంటాడే అందాం. తన చుట్టుపట్ల కొంపల్లో వాళ్లకు డబ్బుక్కూడా పదార్థం దొరకనప్పుడు ఆ సంసారిని వీళ్లు మెక్కనిస్తారా? అందుచేత వెల హెచ్చుగా అమ్మే పద్ధతినేనా రైతులు షావుకార్లకు యివ్వక తమ వూళ్లోనే నిలవచేస్తే బాగుంటుందిగాని అట్టివివేకం రైతులకు వున్నట్టులేదు. అందుకే ప్రభుత్వం కలుగజేసుకోవడంగాని, లేకపోతే యీ పరిశ్రమ ప్రభుత్వానికి తగిలేది కాదు. అయితే సాక్షాత్తుగా పెద్ద అధికార్లు అవాంతరంగా జరిగే మోసాలు కనిపెట్టడానికి అవకాశం వుండదు. యెన్నో మోసాలు జరుగుతాయని మాత్రం వారికి తెలుసు, అక్కడికి ఆ మోసగాళ్లకోసం యేదో ఒక వల తయారుచేశారు. ఆవలవల్ల ఆర్జించిన ఆర్జకులకు నష్టి కలిగినా సామాన్య ప్రజకేంలాభం? గతంలోవలె కాక యికముందు క్షామం రాబోతుంది అని కనిపెట్టి నివారణోపాయాలు వెదుకుతూవున్నారు. వేరుశనగపిండి దగ్గఱనుంచి ఆహారానికి వుపయోగించ వలసిందన్నారు. యింటి దొడ్ల దగ్గఱనుంచీ దున్ని పండించవలసిందన్నారు. తినగలిగితే గడ్డిక్కూడా అభ్యనుజ్ఞ వుంటుందో వుండదో కనుక్కోవాలి. యేం జరుగుతుందో? తుదకు జనాభా పెరగడం కారణంగా భావించి సంతానం ఆపవలసిందనే వారి వూహ. ఆపాతరమణీయంగా కనపడినా నిన్న మొన్నటిదాకా సరిపడి హఠాత్తుగా తన బిడ్డలను పెంచుకొనే శక్తి భారతమాతకు తగ్గిపోవడం అనుభవవిరుద్ధం కనక దీనికి కారణం రైలుద్వారా జరిగే యెగుమతులే కాని అన్యంకాదు. ప్రతీదీ ఒకదానికి లాభంగా వుండేది వేఱొకదానికి నష్టిని కలిగించడం సహజం. ‘బాబుకు పెళ్లి అయిందని సంతోషిస్తే సవతితల్లిరావడానికి విచారించవలసే వస్తుంది."

లోకం యావత్తు తియ్యనీటికి చేపల మాదిరిని పాశ్చాత్యనాగరికతకు అలవాటు పడింది. కుంకుడుకాయలు వాడకం తగ్గింది. ఆ స్థానంలో చాలాభాగం సబ్బు ప్రవేశించింది. చల్దివణ్ణం నాగరిక కుటుంబాల్లోనే కాదు కూలీనాలీ చేసుకునే నిమ్నజాతుల కుటుంబాల్లోనూ