పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/131

ఈ పుట ఆమోదించబడ్డది

అతిక్షమ దైన్యాపాదకమా?

135


అపహరించడానికి యెన్ని విధాల దొంగలో యేర్పడివున్నారు. "శ్లో. అర్థా నా మార్జనే దుఃఖమార్జితానాంచ రక్షణే" అన్న శ్లోకార్థం ప్రసిద్ధమే. యౌవనావస్థలో వుండే శాంతిధనాన్ని అపహరించే దొంగలు స్త్రీలు. వార్థకావస్థలో శాంతి కాపాడుకోవడం కొంతసులభమే అని చాలామంది అభిప్రాయపడతారు గాని యితర వయస్సులే అంతకన్న శాంతిని కాపాడుకోవడానికి యుక్తంగా వుంటాయని అనుభవజ్ఞులంటారు. యేమంటే? వార్ధక్యంలో కోపం సహజంగా ప్రతిమనిషికిన్నీ వుత్పన్నమవుతుంది. యేదో అవధానంలో చిరకాలంనాఁడు యెవరో అడిగితే చెప్పిన పద్యాన్ని యిక్కడ వుదాహరిస్తాను.

"చూపుతగ్గుట దేహదార్ఢ్యము సున్నయౌట మనమ్ములోఁ
 గోప మబ్బుట చిన్నికుఱ్ఱలకున్ హితంబులు చెప్పుటల్
 'శ్రీపతీ! సుగుణాకరా! ననుఁజేరి ప్రోవర!' యంచు న
 య్యాపదుద్ధరు వేఁడి కొంటయు నబ్బు వృద్ధత గూరినన్."

వృద్ధత్వంలో యితరులు చేసే ప్రతీపని యందున్నూ తనకుయేదో విధమైన దోషమే పొడకడుతూ వుంటుంది. ఆకారణంచేత ఆయా పనులను నిషేధించబోతే ఆవలివాళ్లు వినరు పైఁగా తిరస్కరిస్తారు దానిమీద మఱీ కోపం హెచ్చుతుంది. దీన్ని గుఱించి వ్యాఖ్యానం చేయవలసివస్తే చాలా పెరుఁగుతుంది. మనకు ముఖ్యమైన అంశం యేవయస్సులోఁగాని శాంతిని కాపాడుకోవడం కష్టమే అనిన్నీ, అందులో వార్ధక్యంలో చెప్పనక్కఱే లేదనిన్నీ మాత్రమే, సమస్త విషయాలున్నూ పరిత్యజించిన సన్యాసులకుకూడా వొకప్పుడు కోపంవస్తుంది. ఆ సన్యాసిని యెవరేనా బ్రహ్మవిషయాన్ని గూర్చి ప్రశ్నించడం తటస్థిస్తే ఆయన చెప్పినమాటలన్నిటినీవిని తలవూఁపితేతప్ప - తెలియకే అనుకుందాం - అడ్డదిడ్డ ప్రశ్నలు వేయడానికి మొదలు పెడితే ఈ సంగతి స్పష్టపడుతుంది. యింక గృహ స్థాశ్రమంలోవున్న పండితులనుగాని, కవులనుగాని యెవరేనా ధిక్కరిస్తే చెప్పనే అక్కఱలేదు. పండితులకన్నా కవులసంగతి యీ విషయంలో మఱీ అగమ్యగోచరంగా వుంటుంది. కవికిస్వార్థంకంటే పరార్థం యొక్కువ. అందుచేత కవులకు లోకులతో యెక్కువ సంబంధం వుంటుందిగదా! అట్టి కవికి మనస్సులో తనరచన చూచి అందఱూ ఆనందించాలని వుంటుంది. కాని "లోకోభిన్నరుచిః" కనుక కొందఱు ఆనందించేవాళ్లున్నూ కొందఱు యీసడించేవాళ్లున్నూ వుండకతప్పనివిధి అవుతుంది. కొన్ని కవిత్వాలకో? నూటికి 99 గురు యీసడించేవాళ్లే వుంటారు. దానితో అట్టివాళ్లమీఁద గ్రంథకర్తకు కోపం రావడం జరుగుతుంది. కొంచెం గడుసుతనం వున్నవారి కోపమైతే లోలోపల యిమిడి వుంటుంది. అదిలేని కవికోపమో? చిమిడి పాకంతప్పి తనకెంత అపకారం చేయాలో అంతా చేసితీరుతుంది.