పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

17

నేను సుళువుగా రెండుసంతలకు వప్పగించాను పై పద్యం. ఆయన సంతోషించారు. యీ పద్యం తురగా రామకవిగారి చాటుధార, యీయన తాలూకు అగ్రహారం బంటుమిల్లి పండకపోతే శ్రీ మొగల్‌తుర్తి ప్రభువుల సందర్శనానికి వెళ్లేటప్పటికి దివాన్జీగా రన్నారఁట:- యీ యేడు దివాణం పనిన్నీ కిచ్చాటుగానేవుంది వచ్చేయేడు దయచేయాలన్నారఁట. దానిమీద కవిగారికి కోపంవచ్చి “పనసకాయ దొరికినప్పుడు తద్దినం పెట్టుకోవాలిగాని, తద్దినం వచ్చినప్పుడు పనసకాయెక్కడ దొరుకుతుం” దని పైపద్యాన్ని చెప్పాడఁట! ఆ పద్యంవల్ల నాటికవుల నిరాఘాటత్వం మనం తెలుసుకోవచ్చు. "పెద్దాపురపుకోట పెద్దమ్మ కిల్లౌట కవివరేణ్యుల కోప కలనఁగాదె" అన్న మా శ్రవణానందంలోని కవి వరేణ్యుఁడు యీ రామకవిగారే. పిండి ప్రోలు లక్ష్మణ కవిగారు మొదలయిన వారు యీ తురగా రామకవిగారిని వేములవాడ భీమకవిగారితోపాటు గౌరవించి వున్నారు - "ఉంగుటూరిళ్ల రాకాసు లుండవచ్చు" అన్నది కూడా యీ రామకవిగారే, యీయనవాక్కు మంచినిగానీ చెడ్డనుగాని సాధించడంలో పేరుపడింది. మంచివిషయమైన గాథలున్నట్లేలేదు. చెడ్డ లెక్కువున్నాయి. వాట్లను వుదాహరించడాని కీవ్యాసం పట్టలేదు కనుక స్పృశించి వదలుతున్నాను. యిట్టికవులెవరో కొందఱున్నారని ప్రతీకవి కవిత్వాన్ని బట్టి యిలాటి మంచిచెడ్డలు జరుగుతాయని విమర్శించే నేఁటి విమర్శకులధోరణి శోచ్యము. దీన్ని గుఱించి నేఁటరేపటఁ గొంత ప్రసక్తి కలిగితే కలుగుతుందని కొంచెం వాసనగొట్టడంచేత యింతదాఁకా ప్రస్తావించాను.

గురువులవారి శిష్యవిత్తాపహారిత్వం

శ్రీరాజావారిని గురువుగారి దర్శనానికి పంపించివుంది కథాసరస్వతి. యింక అక్కడ జరిగిన సంగతి సందర్భాలు వ్రాయాలి. యేముంది, కట్టేఁడు - కొట్టేఁడు అన్నమోస్తరుగా వ్రాస్తే యిదివఱకే ముగింపయేది. మధ్యమధ్య యితరప్రసంగాలవల్ల కొంత పెరిగింది. కానివ్వండి. గురువులవారికి పాదపూజ వక లక్షకు తక్కువ స్వీకరించడానికి సంకల్పం లేకపోయింది. రాజావారో? యేభైవేలకుమించి యిచ్చేసంకల్పం లేకపోయింది. వారికీ వీరికీ కొంతవఱకు మృదువుగానే కొంత చర్చ జరిగివుంటుంది. శ్రీ రాజావారు గురువులవారి “శిష్యవిత్తాపహారిత్వం” బాగా కనిపెట్టారు. “శిష్యహృత్తాపహారులు" వీరు లేశమున్నూ కారనుకున్నారు. యిట్టివారిని మనం పిలిపించడమే ప్రథమ తప్పిద మనుకొన్నారు. యేభైవేలుకూడా ఆయన అంగీకరించినప్పటికీ ఇవ్వడం దుర్వ్యయమే అనుకున్నారు. యీ దుర్వ్యయం లేకుండా చేసినందుకు గురుపీఠంవారు అభినంద్యు లనుకొన్నారు. యేమనుకొన్నప్పటికీ గురుత్వం వదులుకోడానికి వీలులేదే! దానిలో యివేమేనా స్మార్తగురుత్వాలా? 'అర్థం ప్రాణం ఆచార్యాధీనం' అనే తరగతిలోవి కదా?