పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

126

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి



క. కర్మము లను నెపమున దు
    ష్కర్మమ్మగు హింస సలుపంగాఁజేయుచు నం
    తర్మదమువెంచు నాగమ
    మర్మమ్ముల నామనంబు మసలదు తండ్రీ.

ఇది శ్రీశుకుని వాక్యం. ఇంతేకాదు “జన్నములు పెక్కు పశుహింస సలుపకుండ" అని శౌనకుఁడు సూతునితో ప్రసంగించే ఘట్టంలో కనపడుతుంది - కాఁబట్టి హింసకు మనస్సంగీకరింపక పూర్వ ఋషులు పిష్టపశువుతో యజ్ఞాలు సాగించుకొన్నట్లు స్పష్టంగా గోచరిస్తుంది. ఆయీ ఋషుల మతాన్ని వైదికమతానుయాయులు ద్వైతులూ, విశిష్టాద్వైతులూ (కొందఱుమాత్రమే) అవలంబించారుగాని అద్వైతులుమాత్రం అవలంబించలేదు. అయితే వీరు దయాదూరు లేమో అంటే, అట్టివారు కారు. వేదమును అతిక్రమించి చేసే యజ్ఞం నిష్ఫలమని వీరి తాత్పర్యం. పిష్ట పశువుతో కర్మకలాపాన్ని నిర్వర్తించుకొనే ద్వైతమతస్టులులోనైన వారి మీఁద వీరుకొన్ని పూర్వపక్షాలు చేస్తారు. కాని అవి యుక్తియుక్తంగా వున్నట్లు తోచినా ఆదరణీయాలు కావు. కనకనే జీవహింసకు జంకేవారెవ్వరూ పాటించినట్లులేదు. మాంసభక్షకులు మనుప్యేతర జంతువులన్నీ మనుష్యుని కుక్షిని పూరించడానికే జన్మించినట్లు చెప్పడం యేలాటిదో అద్వైతుల పూర్వపక్షాలున్నూ అట్టివే. వేయి చెప్పండి యీ విషయంలో బుద్దుఁడే ఆశ్రయణీయుఁడు. మనువు “న మాంస భక్షణే దోషం" అని వ్రాసిన మాట సత్యం. అప్పటికి సర్వులూ మాంసభక్షకులే కనక ఆలా వ్రాయవలసి వచ్చిందని తోస్తుంది. దానితోపాటు మఱి రెండుకూడా సమ్మతించి, వెంటనే-

"ప్రవృత్తి రేషా భూతానామ్" అని అనువదించి పిమ్మట తన అభిప్రాయాన్ని యీవిధంగా నిర్వచించాఁడు. “నివృత్తిస్తు మహాఫలా” ఆయీ తుదివాక్యం వల్ల దానినుండి తప్పుకున్నవారు ధర్మాత్ములు అని తేలింది. దీన్ని పురస్కరించుకొనే “మ్రానను రాతనుంగలదె? మాంసము ప్రాణుల మేనఁగాక" అని భారతంలో నిషేధం కనబడుతుంది. భీష్మడంతటివాఁడు దీన్ని ఖండితంగా నిషేధించలేక మనువులాగే మానడం మంచిదని వూరుకున్నాడు. కాని మొత్తం ప్రపంచంమీంద యావత్తు ఖండాలలోనూ పరిశీలిస్తే ప్రతిరోజూ యెన్నికోట్ల జీవరాసులు (కోళ్లు, మేకలు, యెడ్లు వగయిరాలు) మానవుల కుక్షిలో జీర్ణిస్తున్నా ఆయాజాతులు దినదినాభివృద్ధిగా పెరుగుతూ వుండడం చూస్తే మాంస భక్షకుల యుక్తికూడా సమంజసమేమో అనిపిస్తుంది. అంతేకాదు, బుద్దుని అభిప్రాయం ప్రకారం యావన్మందీ శాకభక్షకులే అయితే ఆయీ జంతువులు నివసించడానికిన్నీ ఆహారం సంపాదించుకోవడానికిన్నీ మఱికొన్ని ద్వీపాలను సృష్టించవలసివస్తుందేమో సృష్టికర్తకు