పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

118

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

పలాయనంమిథ్య"గా వుంటుంది. గురువును మించిన శిష్యులుంటారనిన్నీ బొత్తిగా గురువు ధర్మేతరంగా తొక్కుకు వస్తూవుంటే ధర్మబద్ధమైన యుద్ధానికి శిష్యుండు అంగీకరించ వచ్చుననిన్ని దీనివల్ల తెలుసుకోవలసి వుంటుంది. చాలాకథలు యీలాటి అర్థవాదాలుగా పుట్టినట్టే మనలో విజ్ఞలు అభిప్రాయపడతారు; భారతంలోకూడా కొన్ని కథలు అర్థవాదాలు అంటే కేవల కల్పితాలు లేకపోలేదు. గాని ప్రధానకథకు సంబంధించిన భీష్మాదిపాత్రలు మాత్రం యీ తెగలోకి చేరేవికావు. పరశురామ భీష్ములకు సంబంధించిన చరిత్రను గూర్చి లోకంలో యింకోవిశేషం కనపడుతుంది. యెక్కడోతప్ప బాహుపరాక్రమంచేత క్షత్రియులను వోడించిన బ్రాహ్మణులు లేకపోవడంచేత కొందఱు క్షత్రియులకు ఆ కథాభాగం పురాణం జరుగుతూ వున్నప్పడు వినడం చాలా కష్టంగా వుంటుంది. అట్టి సమయంలో గంభీరహృదయులు కొందఱు యేలాగో పైకి తేలకుండా కాలక్షేపం చేస్తారుగాని కొందఱుమాత్రం త్వరగా కానివ్వండి అంటూ పౌరాణికులను తొందరపెట్టడం ద్వారాగా తమ అసూయను ప్రకటించడంకలదు. భీష్ముండు పరశురాముణ్ణి వోడించే ఘట్టంలో యూలాటి తొందర వారు కనపఱచరనిన్నీ వింటాను. దీన్నిబట్టి అనాదిగా జాత్యభిమానం మనదేశంలో కనబడుతుందని విస్పష్టం. యీ మాదిరిదే అని చెప్పఁజాలంగాని యేదోమాదిరి జాత్యభిమానం ఖండాంతరాలలోనున్నూ కనపడుతూనే వుంటుంది. ఆయా విషయం యీ మధ్య ఎడ్వర్డు చక్రవర్తిగారి వివాహంలో అందఱికీ విస్పష్టం అయిందే. కాCబట్టి విస్తరించనక్కఱలేదనుకుంటాను. నిన్న మొన్నటినుంచి యీ జాతిబాధ కవిత్వానిక్కూడా కనపడుతూవుంది. సంబంధబాంధవ్యాలకు జాతిభేదం పాటింపని సంఘాల క్కూడా తక్కిన విషయాలకు యిది బంధిస్తూనే వుంటుందని ఖండాంతరాలవారి ప్రవర్తనవల్ల తేటతెల్లమవుతూ వుండడంచేత బాగా ఆలోచిస్తే మనహిందువుల యేర్పాటే బాగుందేమో? అనిపిస్తుంది. యిది విషయాంతరం. మనకు ప్రస్తుతం భీష్ముని చరిత్ర. యింత జ్ఞాని, యింత శూరుండు, యింత ధర్మాత్ముండు, రాజులలోనే కాదు యితరులలో కూడా లేడంటే వప్పనివారుండరు. యీతని పరమపదారోహణంకూడా మిక్కిలి వర్ణనీయంగా వుంటుంది. ఆ సందర్భం అశ్వమేధంలో కొంత విస్తరించి వుంది. ధర్మరాజుకు ధర్మబోధ చేయడానికి శ్రీకృష్ణభగవానులుయీయన్ని నియమించడంవల్ల బాగా ఆలోచిస్తే శ్రీకృష్ణ భగవానునికి తెలియని ధర్మ సూక్ష్మాలు యీయనకు తెలుసునని మనం నిశ్చయించు కోవచ్చును. అట్టి ధర్మజ్ఞCడు కనుకనే శ్రీకృష్ణునికన్న మిక్కిలి వృద్ధయియుండిన్నీ కృష్ణుండు భగవదవతారమని యెఱిఁగినవాcడవడంచేత మోక్షార్ధియైన భీష్ముండు శ్రీకృష్ణభగవానుడ్లే శరణ్యునిగా స్తుతిస్తూ వచ్చాడు. ధనుర్ధరుండై శ్రీకృష్ణుణ్ణి బాణాలతో చాలా నొప్పించినప్పటికీ భక్తిని కనపఱుస్తూనే వుండేవాఁడు. యుద్ధధర్మ సర్వస్వవేది కావడంచేత కృష్ణుణ్ణి బాణాలచే నొప్పించియున్నాండు.