పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/168

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణదేవరాయలు

157

మీఁది యభిమానమును మానలే”దనెనట! రాయ లత్యానందము సెంది యాచాకలివాని నేది కావలయునో కోరుకొమ్మనెనఁట! వాఁడు దేవరకోట యేలవలెనని కోరిక కలదనెనట! అప్పుడే యక్కడ వానికి దేవరకోట సీమ నేలుకొమ్మని యనుజ్ఞ నొసంగెనఁట. నేఁ డాదేవరకోట సీమను గమ్మజమీందారులు పాలించుచున్నారు. కాని నేఁటివఱకును నాసంస్థానమునఁ జాకలిచేఁ బల్లకి మోయింపకుండుటయు సీలు మొహర్లు వానియొద్దనే యుంచుటయు నాచారముగా వచ్చుచుండె నందురు. కృష్ణరాయలపై ననేక కవులచేఁ జెప్పఁబడిన చాటువులు—

ఉ. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులుం గల్గి దు
    ర్భరషండత్వబిలప్రవేశకలనబ్రహ్మఘ్నతల్ మానినన్
    నరసింహక్షితిమండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీసాటిగా
    నరసింహక్షితిమండలేశ్వరుల కృష్ణా! రాజకంఠీరవా!
మ. కలనం దావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండమం
    డలభేదం బొనరించి యేఁగునెడఁ దన్మధ్యంబునన్ హారకుం
    డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లోఁ
    గలఁగం బాఱుచు నేఁగె నీవ యనుశంకన్ గృష్ణరాయాధిపా!
ఉ. ఏపునఁ గృష్ణరాయజగతీశ్వరుఖడ్గము మింట మార్గముం
    జూపిన భానుమండలము సొచ్చి హుటాహుటి శత్రు లేఁగుచో
    రేపటిబాపనయ్య పగలింటిమహోగ్రపుజంగమయ్య! యో
    మాపటి దాసరయ్య! మము మన్నన సేయు మటందు రెంతయున్.
ఉ. కాశియు నీకరాసిసరిగాదు నృసింహునికృష్ణరాయ! యా
    కాశిని జచ్చువారికిని గల్గును జేతికిఁ బుఱ్ఱె నీమహో
    గ్రాసిని గండతుండెమాలుగా మృతిఁ బొందిన వైరికోటికిన్
    భాసురరాంభకుంభకుచభారము లబ్బెడు నేమిచిత్రమో!