పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

చాటుపద్యరత్నాకరము

పకపోదురా యనుధైర్యముతో నాయింటికేఁగి, తనరాక యాయింటియజమానునకుఁ దెల్పఁగాఁ బనితొందరలతో విసిగియున్న యాతఁడు త్వరపడి, “యిప్పుడీకవులయేడుపే నాకుఁ బట్టినది. చాలు చాలు వెళ్ళు వెళ్ళు” మనయెనఁట. అందుపై నీకవికిఁ గోపము వచ్చి, యీక్రిందిపద్యమునుఁ జెప్పెనఁట.

సీ. పెండ్లిపేరంటాండ్రు పెనురంకులకు నేడ్వ
            బాజాభజంత్రీలు పప్పు కేడ్వ
   రాజబంధువులంత రంకుముండల కేడ్వ
            బాజారువెలఁదులు పసుపు కేడ్వ
   వచ్చిపోయెడువారు వక్కలాకుల కేడ్వ
            గుగ్గిళ్ళకై పెండ్లిగుఱ్ఱ మేడ్వఁ
   బల్లకిబోయీలు భత్యాలకై యేడ్వ
            బలుపురోహితుఁడు నేబులకు నేడ్వ
   హారతిరూకల కాడుబిడ్డలు నేడ్వ
            కుఱ్ఱవాండ్రందఱుఁ గూటి కేడ్వ
   అల్లుఁ డనాథయం చత్తమామలు నేడ్వ
            కట్నంబుకై గ్రామకరణ మేడ్వ
   పెద్దమగం డని పెండ్లికూఁతురు నేడ్వ
            పిల్ల చిన్న దటంచుఁ బెనిమి టేడ్వ
   చాల్పుగా నిన్నియేడ్పుల సాగెఁ బెండ్లి
   సరస తాళ్ళూరులోపల విరసముగను
   నఱ్ఱపేరయ్య చేసె యీనాటి కహహ
   కమ్మకులమున జన్మించి ఘనులు నవ్వ.