ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంపూరచన కితఁడు మార్గదర్శి. ఇందుల కితఁడు 'గద్యానుబన్ధరసమిశ్రితపద్యసూక్తిర్హృద్యాహివాద్యకలయాకలితేవగీతి' యని గద్యముతోఁ గూడిన పద్యకావ్యము వాద్యముతోఁ బాడిన గీతమువలె హృద్య మని కారణమును నిరూపించెను. ఇతఁ డీచంపూరామాయణమునం దయిదుకాండములే రచించి యేకారణమువలననో యాఱవది యగుయుద్ధకాండమును రచింపక విడువఁగా దానిని లక్ష్మణసూరి యనుకవి రచించి పూరించినవాఁ డయ్యె. ఈకవిశిఖామణు లిద్దఱును రచించిన యీచంపువు మృదుమధురపదసందర్భసుందరమై చదువరుల నిర్భరరసాస్వాదపరవశులం జేయుచు సంస్కృతభాషకు వన్నెగలిగించుకావ్యములం దొకమిన్నగా నెన్నందగియున్నది.

ఇట్టి ప్రబంధమును దెనుఁగుచేసినవాడు కవిరాజకంఠీరవ బిరుదాంకితుఁ డగుఋగ్వేదికవి వేంకటాచలపతి.

ఇతని యాంధ్రీకరణపుఁ దెఱంగులు కొంత పరామర్శింతము. ఇతఁడు మూలమును గొన్నియెడల వేఱుగ మార్చియుఁ, గొన్నిపట్టుల లేనివి గూర్చియుఁ, కొన్నిచోట్ల నున్నవి విడిచియుఁ దెలిఁగించినను మొత్తముమీఁద మూలమున కంతగా హెచ్చును దక్కువయుఁ గాకుండ దీనిని రసవంతముగానే రచించినాఁ డనవచ్చును. భాషాంతరము సేయుట యనఁగా నొకభాషలోని పదమునకు మఱి యొకభాషయందలి మాఱుపదమును మక్కీకిమక్కీగాఁ బెట్టుట గాదు. భాషలు తమతమశబ్దవాక్యస్వరూపవిశేషములంబట్టియుఁ, దన్మూలకము లైనవ్యాకరణప్రక్రియలంబట్టియు, రచనయందును శైలియందును, స్వభావమునందును బరస్పరభేదము గలిగియుండును గనుక నొకభాషయందలిపదములను మరొకభాషలోనికిఁ బరివర్తనము చేయునప్పు డారెండవభాషస్వభావాదుల ననుసరించి తగుకొలందిని వానిని మార్చియుఁ గూర్చియు రచించిననే యవి రమణీయమై రసవంతముగా నుండును. 'బ్రహ్మాండభాండము'లను 'బమ్మగ్రుడ్డుకుండ' లనుట గాని 'పెండ్లికొడుకు'ను 'వివాహపుత్రుఁ' డనుటగాని భాషాంతరము గాదు. దీని నెఱింగియే కవికులాదృష్టాధ్యగమనుఁ డగుశ్రీనాథుఁడు తన తెనుఁగునైషధమున 'శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావం బుపలక్షించియు, రసంబుఁ బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబు పరిహరించియు మాతృకానుసారంబునఁ జెప్పంబడిన యీభాషానైషధకావ్యం' బని వ్రాసినాఁడు. ఇంక నీ కవి తెనుంగునందలి మార్పులను గూర్పులను విడుపులను నుదాహరించెదము.