ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాఁతపుస్తకములలో బహుదోషముల పాలయి యుండినది. దీనియర్థమును భేదించుట సామాన్యపండితులకును అశాస్త్రజ్ఞులకును శక్యముగాదు. అట్టి యీ కఠినగ్రంథమును విద్వత్సార్వభౌములగు శ్రీమద్వెల్లాల సదాశివశాస్త్రి , శేషశాస్త్రులవారలు చేపట్టినందున దీనికి సమంజసమైన వ్యాఖ్య నిష్పన్నంబయి, యిది పండితులకు సుఖముగా నాస్వాదనీయం బయినది. ఇట్టి యీకావ్యమునకు వీరిచే వ్యాఖ్య చేయించి ముద్రింపించిన ప్రభువులకు శాశ్వతకీర్తియు, ఆంధ్రపండితులకు వారింగూర్చి యఖండకృతజ్ఞతయు పృథివియందు నెలకొన్నవి.”

వేదము వేంకటరాయశాస్త్రి

మదరాసు 8-11-04

శ్రీకవిసార్వభౌములగు మ.రా.రాజశ్రీ రావుబహద్దరు కందుకూరి వీరేశలింగం పంతులవారిచ్చిన యభిప్రాయము.

“తాము దయతో నంపిన శ్రీకొల్లాపురాధీశ్వర మాధవరాయకృత చంద్రికాపరిణయమును నే నక్కడక్కడఁ జదివి చూచితిని. మూలము వసుచరిత్రమువలె శ్లేషభూయిష్ఠమయి మృదుపదఘటితమయి యత్యంతప్రౌఢముగా నున్నది. శ్రీమద్వెల్లాల సదాశివశాస్త్రులవారిచేతను, అవధానము శేషశాస్త్రివారిచేతను రచియింపఁబడిన వ్యాఖ్యానము సామాన్యముగఁ బండితులకు సహితము దురవగాహములుగా నుండు మూలభాగముల యర్థతాత్పర్యములను స్పష్టముగా వివరించునది యయి, వారి యసమానపాండిత్యమును వెల్లడించుచు సర్వవిధముల శ్లాఘాపాత్రమయి లోకోపకారార్థముగాఁ జంద్రికాపరిణయమును ముద్రింపింపఁ బూనిన వర్తమాన కొల్లాపురాధీశ్వరులగు సురభి రాజా వేంకటలక్ష్మారావు బహద్దరుగారికిఁ గీర్తిదాయకమయి యున్నది. ఈ సవ్యాఖ్యాన చంద్రికాపరిణయ మాంధ్రమండలమునం దంతట వ్యాపించి శాశ్వతముగా నెలకొనుఁగాక!

ఇట్లు విన్నవించు భవద్విధేయాప్తుఁడు కందుకూరి వీరేశలింగము