ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘శిరసంటన్’ – శిరసునంటన్ అని యుండవలసిన ‘శిరసును’ అను ద్వితీయాంతమునకు ‘శిరసు’ అను ప్రథమాంతమును స్వీకరించి, దానికి శిరసు+అంటన్=శిరసంటన్ అని సంధి చేసినాడు. అవయవవిశేషవాచకమగు ‘శిరసు’ జడవాచకమగుటచే ‘జడవాచకంబుల ద్వితీయకు ప్రథమ యగు’ నను బాలవ్యాకరణసూత్రముచేత సాధుత్వము. ‘న్వ్యా’ అను సంయుక్తాక్షరము నందలి ‘న’కారమునకు ‘శిరసంటన్’లోని బిందుపూర్వకటకారము (౦ట)నకు యతి చెల్లుట మరియొక విశేషము.

“పలుకు వాలు దొరలన్”

(ఆశ్వాప్ర. ప.146)

‘శాపరూపవాక్కు లాయుధముగా ప్రభువులు=మునిశ్రేష్ఠులు’ అని యర్థము. చక్కని తెలుఁగు కర్మధారయసమాసము.

‘తళుకుఁబ్రాఁగెంపుమెట్టులదారి’ మెఱయుచున్న ముదురుకెంపులయొక్క సోపానమార్గము. తత్పరుషసమాసము.

“పగడపుఁగంబముల్ … … … … … …… … … … …
 … … … … … …… … నచ్చపు బంగరు పేరరంగునన్”

(ఆశ్వాద్వి. ప.23)

‘పేరు+అరంగు=పేరరంగు=విశాలమైన వేదిక. ఇచ్చట కర్మధారయమునం దుత్తున కచ్చు పరంబగు నపుడు రావలసిన ‘టు’గాగమము వచ్చి ‘పేరుటరంగు’ అని యనకపోవుటకుఁ గారణము టుగాగమము వైకల్పిక మగుటయే.

‘నలువకు జొహారు గావించి నిలిచె నపుడు’ (ఆశ్వాద్వి. ప.43). ‘జొహారు’ జోహారునకు రూపాంతరము.

‘పడఁతి! యొకమౌని నిల మోహపరచుటెంత!’ (ఆశ్వాద్వి. ప.51). పడ్వాదులు పరంబులగు నపుడు ‘ము’వర్ణము లోపించును.

‘భయముపడు’ ననునది ‘భయ పడు’ అయినట్లే, ‘మోహము పరచుట’ ‘మోహపరచుట’ యైనది.