ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విధానమును స్మృతిపథమున నిలుపును. ఇఁక తన సంస్కృతభాషాప్రావీణ్య మును జూపుచు పార్వతీస్తవముగా రచింపఁబడిన సంస్కృతదండకమునందు విచిత్రశైలితో పాటు విశిష్టతంత్రశాస్త్రమర్యాదలును గోచరింపఁజేయును. పద్యరచనయందువలెనే గద్యరచనయందును సాటిలేని మేటికవి యితఁడనిపించును.

వ్యాకరణవిశేషములు:

క॥ ఆమల్లనృపతి చెన్నాం
బా మానినియందుఁ గాంచె మల్లక్షితిపున్,
వ్యోమగవీ సోమగవీ
రామ గవీశాచ్ఛకీర్తి రాజన్మూర్తిన్.

(ఆశ్వా1 ప.33)

ఇది మాధవరాయల వంశీయులలోఁ బూర్వుఁడగు నొక మల్లభూపాలుని కుమారుఁడు రెండవమల్లభూపాలుని వర్ణన. అతని కీర్తి వ్యోమగవీ=కామధేనువు, సోమగవీ=చంద్రకిరణము, రామ=బలరాముఁడు, గవీశ (గో+ఈశ=గవీశ)=సరస్వతీశివుల వలెను, అచ్ఛ=తెల్లనై యున్నది అని దీని యర్థము. గోశబ్దముపై సమాసాంత ‘టచ్’ప్రత్యయమును, స్త్రీత్వబోధకమగు ఙీప్ (ఈ) ప్రత్యమును వచ్చుటచేత ‘గవీ’ యనునవియు, ‘గవీశ’ అనునది అవాదేశసంధి వచ్చుటచేతను సిద్ధించిన రూపములు.

సీ. “ధర్మనిర్మథనంబు దాఁజేసి జనకజా ‘పాణౌకృతి’ క్రీడఁ బ్రబలఁడేని”

(ఆశ్వా1 ప.60)

‘పాణౌకృతిక్రీడ’ యనఁగా వివాహము. ‘నిత్యం హస్తే పాణా వుపయమనే’ యను పాణినీయసూత్రముచేత పాణిశబ్దము యొక్క సప్తమీవిభక్తికి లోపము రానందున (అలుక్) ‘పాణౌకృతి’ యను రూప మేర్పడినది. ఇది యలుక్సమాసము. ఉపయమన మనఁగా వివాహము చేసికొనుట.