ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. జనవరసార్వభౌమునెద సామ్యనుబింబితమై నెలంత యుం
చిన సుమదామకంబు గనఁ జేర్చె ముదంబు తదంతరంబునం
దెనసి కలంచునట్టి కుసుమేషుశరాళులఁ బట్టి తెత్తుఁ జ
య్యన నిఁక నిల్వఁ జేయుదు నటంచు వడిం జొరఁబాఱుకైవడిన్. 133

చ. పుడమిమగండుదాలిచినపువ్వులదండ తదంగకాంతిచేఁ
గడుఁ గనకప్రసూనసరగౌరవ మూనఁగఁ దుమ్మెద ల్భయం
బడరఁగ జాఱ సాగె నచలాధిపకన్య వరించె నీశునిన్
గడిమికిఁ జేర కింక నని కంతునకు న్వివరింపనో యనన్. 134

మ. ఘనపంకేరుహరాగహారరుచిరేఖావ్యాప్తమై యింతి వై
చిన యాక్రొవ్విరిదండ భర్తయెదఁ బొల్చెన్ దన్మృగాక్షీవినూ
తనరాగేందిర చేరి యద్ధరణినేత న్గౌఁగిటం దార్చి నం
తనె కన్గో నగుతద్భుజావసులతాద్వంద్వైకబంధం బనన్. 135

చ. అలవిరిదండచాయ కర మయ్యెడఁ బర్వఁగఁ దన్నృపాలహా
రలతలచాయ గాంచఁగ విరాజిల దయ్యెఁ దలంప నౌ విని
ర్మలమహిరాట్సుతాంచితకరస్థితి మించుచుఁ జేరువారి మేల్
చెలువముచెంగటన్ ధరణిఁ జిల్లరపేరులవన్నె హెచ్చునే. 136

మ. హరిమధ్యార్పితసూనదాముఁడయి గోత్రాధీశ్వరుం డత్తఱిన్
జిరకాలేహితకాంక్ష యంతయును దం జేరం బ్రమోదాశ్రుసం
భరితాక్షిద్వయితో గళద్విరహతాపశ్రీకచిత్తంబుతో
నురురోమాంచపినద్ధవిగ్రహముతో నొప్పూనెఁ జిత్రంబుగన్. 137

వ. అయ్యెడ నయ్యగరాజకుమారి యాసప్తసముద్రమధ్యరాజలోక వర్ణనాసమయోరరీకృత మానుషా కారంబు దూరంబు కావించి, యుదంచిత చంచరీకకులాకర్షణప్రకార భావసంమిళిత పరిమళమిళిత పారి జాతకుసుమమాలికాసంవేష్టితవేణీకలాపయును, జూడావలంబిత