ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూపాలాగ్రణి పుణ్యశ్లోకుఁడై బహుపురాతనరాజన్యుఁడై యుండెనని శ్రీమద్వాల్మీకి రామాయణ బాలకాండమునందలి యీశ్లోకము సాక్ష్య మొసగును.

శ్లో॥ విశాలస్య సుతో రామ! హేమచంద్రో మహాబలః।
‘సుచంద్ర’ ఇతి విఖ్యాతో హేమచంద్రా దనంతరః॥

ఇఁక కథానాయిక ‘చంద్రిక’. ఈయువతి ‘వసంతుఁడు’ అను మునివరుని శాపముచేత మనుష్యజాతియందుఁ బుట్టిన ‘చిత్రరేఖ’ యనఁబడు దేవాంగన. మానవస్త్రీయై పుట్టిన యీమెకు పాంచాలదేశాధిపతి యగు ‘క్షణదోదయ’నరేంద్రుఁడు తండ్రి. ‘శ్యామ’ యను నామె తల్లి. ఇట్టి లోకోత్తరనాయికానాయకుల ప్రేమను ఇతివృత్తముగా స్వీకరించి వారిపరిణయముతో సుఖాంతముగా నీ కావ్యమును ముగించినాడు శ్రీ సురభిమాధవరాయలు. ఈకవి రామరాజభూషణునికి సమకాలికుఁడనియు, నీచంద్రికాపరిణయము వసుచరిత్రకు సమకాలీన మనియు శ్రీ తిరుమలసెట్టి జగన్నాథకవి ప్రభృతులయిన సాహిత్యవిమర్శకులు నిర్ణయించుట వలన మాధవరాయలు, వసుచరిత్రయొక్క కథానాయకుఁడు ‘ఉపరిచరవసు’వనఁబడు పురాణపురుషుఁడై యుండఁగా నంత కేమాత్రము తగ్గని రామాయణమహాకావ్యమునం దుల్లేఖింపఁబడిన ‘సుచంద్రుఁ’డను మహాపురుషునిఁ దనకావ్యమునకు నాయకుఁడుగా నేర్పరచినాడని మనము గ్రహింపవలయును. ఇఁక నాయికయగు ‘చంద్రిక’ వసుచరిత్రనాయిక యగు ‘గిరిక’కు ఏ మాత్రమును దీసికట్టుగా లేదు. అనేకఘట్టములలోను, సంఘటనములలోను, వర్ణనములలోను, విశ్రమప్రదేశములందును ‘వసుచరిత్ర’, ‘చంద్రికాపరిణయము’లకు సారూప్యమున్నది. ఇవి సమకాలికకావ్యములే యైనచో మాధవరాయలు వసుచరిత్రము ననుసరించెనా? లేక భట్టుమూర్తి చంద్రికాపరిణయము ననుసరించెనా? యను సంశయము గలుగక మానదు. కాని యిద్దఱును ఉద్దండులు. ఇద్దఱును మహాకవులు. ఇద్దఱును పదపదైకదేశస్వారస్యసహితముగా సాహిత్యమర్మము నెఱిఁగినవారు. ఎవరి శైలి వారిదే యైనప్పటికిని రామరాజభూషణుఁడు లోకప్రసిద్ధరూఢిప్రయోగములు చేయుటలో దిట్ట యని తలంచినచో, మాధవరాయలు యౌగికార్థసంవలితములయి, శాస్త్రనిఘంటువులయందలి యసామాన్య యౌగికార్థములు కల్పించి, పదప్రయోగ ములు చేయుటలో దిట్ట యని తలంపవలసి యున్నది.