ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మగతేఁటి వేడ్క మించఁగ ముద్దుగొనిన చ
క్కనిమెట్టదామరకళుకుఁ జూచి,
సొలపుచక్కెరతిండిపులుఁగు నొక్కెడిబింబి
కాపక్వఫలముపొంకంబుఁ జూచి,

తే. తరుణిచనుదోయి, కెంపుగందవొడిఁ బూసి
చెలువనెమ్మేను కౌఁగిటఁ జేర్చి కొమ్మ
మోము ముద్దిడి, పూఁబోణిమోవిఁ గ్రోలి
చెలఁగు టెపు డబ్బునో యంచుఁ దలఁచు నృపతి. 94

సీ. ఎంతమాధవదయాసంతానసంసిద్ధిఁ
బొలిచెనో యిచ్చటితిలకపాళి,
యెంతపుణ్యద్విజాధీశసంసేవన
వఱలెనో యిచ్చటిచిఱుతమావి,
యెంతమహాసవోద్ధృతిగతాత్మసుమాప్తి
మనియెనో యిచ్చటికనకరాజి,
యెంతసదాళిచిత్తేష్టదానస్ఫూర్తి
వెలసెనో యిచ్చటికలికిక్రోవి,

తే. చెలికటాక్షైకధారచేఁ జెలఁగ నెలఁత
పాణిలాలనమున మించఁ
బడఁతిమోము
గని యలర, నాతిపరిరంభగరిమఁ జొక్క
ననుచు నృపమౌళి కడుఁజింతఁ బెనుచు మదిని. 95

మ. నవలా యేగినదారిఁ గాంచు, మదిఁ దన్నాళీకపత్త్రేక్షణా
నవలావణ్యవిశేష మెంచు, వలవంతం జాలఁ జింతించు, రా
జవలారాతి తదేకమోహలహరీసంసక్తచిత్తంబునన్
గువలాస్త్రాతినిశాతసాయకశిఖాకుంఠీభవద్ధైర్యుఁడై. 96