ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింగభూపాలుఁడు విద్యావిశారదుఁడై రసార్ణవసుధాకరాది గ్రంథప్రణేతయై ‘సర్వజ్ఞుఁ’డను బిరుదమును గాంచియుండఁగా, అరిపురిభేదన, నతరాజవర్ధన, అహీనాంగదకలనాది శ్లిష్టవిశేషణ రూపణాదులచేత నీశ్వరునిఁబోలిన సర్వజ్ఞుఁడని కవి యీ పద్యమున వర్ణించెను. మరియు,

తే. “అర్థి సాత్కృత సురభి, పరాళి సురభి,
సుగుణవల్లీ ప్రకాండైక సురభి, కీర్తి
జిత సురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరగఁ దద్వంశమును గాంచె సురభిసంజ్ఞ.”

యాచకాధీనముగాఁ జేయఁబడిన సువర్ణముగలవాఁడును, శత్రువులనెడు తుమ్మెదలకు సంపెంగ యైనవాఁడును, సుగుణము లనెడు తీగలకు వసంతుఁడైన వాఁడును, కీర్తిచేత జయింపఁబడిన కామధేనువుగలవాఁడును, శౌర్యపరిమళముగలవాఁడు నగు సింగభూపాలుఁ డుదయించుటచేత నతనివంశమునకు ‘సురభి’ యను పేరు ప్రసిద్ధమై యున్నదని చెప్పెను. వస్తుతః సురభి యను గ్రామమునం దీవంశమువా రుండియుండుటచేత వీరి యింటిపేరు ‘సురభివార’ని వచ్చినదని యైతిహాసికులు విశ్వసించుచున్నారు. ఈరాజకవి పెదకోమటి వేమభూపాలునికి సమకాలికుఁడై గ్రంథరచనయందును విద్వత్పోషణమునందును నతనితో స్పర్థ వహించి యుండెనని విమర్శకులు భావించుచుండుటచేత నితఁడు క్రీ.శ.1403 మొదలు క్రీ.శ.1430 వరకును, తరువాత మరికొంత కాలమును జీవించియుండె నని మనము భావింపవచ్చును.

ఇట్లు విస్తరించుచు వచ్చిన రేచర్లగోత్రజులగు జటప్రోలు సురభివారికి, బేతాళనాయనికిఁ బదమూడవతరమువాఁ డగు మాదానాయఁడు శాఖామూలపురుషుఁడు. వీరు నల్లగొండ, దేవరకొండ ప్రాంతములందే యేలుబడిని సాగించుచు నుండి తరువాతి కాలమున జటప్రోలును రాజధానిగా నేర్పరచుకొన్నారు. జటప్రోలుకు సమీపమందున్న చిన్నమరూరు, బెక్కెం, పెంట్లవల్లి, వెల్లూరు గ్రామములలోఁ గోటలు గట్టి, తటాకములు వేయించి, దేవాలయములు కట్టించి, దేవతాప్రతిష్ఠలును జేసి, సుమారు రెండువందల సంవత్సరముల క్రింద ప్రస్తుతము రాజధానీనగరముగా నున్న కొల్లాపురమునకుఁ జేరిరి. అయినను వీరికి