ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నై విరాజిల్లు శతాంగరాజం బారోహించి, యాత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబున నడరు చక్రకాంత చక్రంబులం గటాక్షించుచు నని వార్య రసవిశేష విలసిత పద్మినీ సందోహంబుల కామోదంబుఁ గూర్చుసొంపునం బెంపొందుచు, నఖండ రాజమండల తేజోగౌరవంబు నిజ తేజో మహిమంబున సంపాదించుచు, నక్షీణ దస్యు వీక్షణ సమ్మద విక్షేపకాక్షుద్ర కరకాండ చండిమంబునఁ జూపట్టుచు, నఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాప ణోల్లాసంబున వెడలె నయ్యెడ. 156

చ. హరిభయకృద్రయాన్వితములై, యభిరూపకలాపజాతభా
స్వరత వహించి, చూడఁదగు వాజివరంబుల నెక్కి రాజశే
ఖరతనయౌఘ మేఁగె మహికాంతుని వెంబడి దివ్యశక్తితో
నరు దగు తారకాత్మదరదాత్మసమాఖ్య బుధుల్ నుతింపఁగన్. 157

చ. తనుపులకాలిమేలు పయిఁ దార్చిన బంగరుజూలుచాలు చ
క్కనికటిసీమలం దనరు గైరికరేఖలడాలు సాలఁ గ
న్గొన ముద మూన్ప భద్రకరికోటులు వెల్వడె రాజువెంటఁ జ
య్యనఁ బదమేఘగాళితతు లందుకజాలకయుక్తిఁ బూనఁగన్. 158

మ. అమరెం దత్సృతి నేఁగు నీలమయచక్రాంగంబు లింద్రావరో
ధముఁ దప్పించుక ధాత్రిఁ జేరిన సముద్యత్పుష్కలావర్తము
ఖ్యమహామేఘకులంబులో యనఁగఁ జక్కం గాండధారావిశే
షములుం, భూరిమణీశరాసనవిభాజాతంబులుం జూడఁగన్. 159

చ. అనఘవిసారపాళియుతి, నంచితశుభ్రశరాప్తిఁ, బుండరీ
కనిచయలబ్ధి, నాగవరకాండనిషక్తిఁ, గనం బొసంగువా
హిని యల యంశుమత్కులమహీశ్వరు వెంబడి నేఁగఁ జొచ్చె న
భ్రనది భగీరథానుసృతి భవ్యరయస్థితి నేఁగుచాడ్పునన్. 160