ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాధాన్యము పద్యముదే. దానివలె స్వతంత్రముగా జిహ్వాగ్రమున నిలిచి మానవుని నైతిక ధార్మిక సాంస్కృతికాద్యనుభూతులను నెమరువేయింపఁ గల శక్తి వచనాదిప్రక్రియలకు లేదు. కనుక పద్యమును వదలుట గాని వ్రాయమానుట గాని వాంఛనీయము గాదు. ఈనాటికిని సుమతి వేమన శతకములకును మరికొన్ని చాటువులకును సంస్కృత శ్లోకములకును గల ప్రాచుర్యము తిరస్కరింపరానిదికదా! అయితే పద్య మెట్టిపదజాలము కలిగియుండవలెను? ఎట్టి భావసంపద యుండవలెను? యెట్టిశైలి కావలెను? అన్న ప్రశ్నలు రచయితయొక్కయు, అతనిరచన నర్థముఁజేసికొనఁగలిగిన సహృదయుని యొక్కయు శక్తికిని అభిరుచికిని మాత్రము సంబంధించినట్టివే కాని యెవరంటే వారికి సంబంధించినవి కావు.

కనుక ‘ఉత్పత్స్యతే మమతు కోఽపి సమాన ధర్మా, కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పృథ్వీ’ అను భవభూతిమహాకవి యభియుక్తోక్తిని పురస్కరించుకొని శ్రీ సురభిమాధవరాయ రాజకవి యీచంద్రికాపరిణయప్రబంధమును రచించెను. ఇందున్న పదప్రయోగవిశేషములను, భావపరీమళమును, రసఝరీమాధుర్యమును, శ్లేషయమకచమత్కృతిని, అలంకారశోభను, ఇంకను తత్తద్గుణవిశేషములను దెలిసికొని సహృదయు లానందింతురుగాతమని యకాడమీవారు దీని పునర్ముద్రణమునకుఁ బూనుకున్నారు. యథాశక్తిగా నీకావ్యశోభను దిఙ్మాత్రముగాఁ జూపు పీఠికను రచించుటకై నన్నాదేశించినారు. ఈ బృహత్తర కార్యమున కల్పజ్ఞుఁడ నగు నన్ను బ్రేరేపించుటకు ముఖ్యకారణము శ్రీ సురభి మాధవరాయల వంశీయులగు రాజులకు భారతస్వాతంత్ర్యలబ్ధికిని, సంస్థానవిలీనములకును అతిసన్నిహితమగు కాలమువరకు రాజధానియై, ఇప్పటికిని మహబూబునగరమండలమునఁ దాలూకాకేంద్రమై యున్న కొల్లాపురముతో నాకు సన్నిహితసంబంధ ముండుటయు, నాజన్మస్థాన మా తాలూకాయందే యుండుటయు ననుకొందును. కారణ మేది యైనను నేను ధన్యుఁడను. ఈపనికి నియోగించిన సాహిత్య అకాడమీ కార్యదర్శికిని యితరసభ్యులకును గృతజ్ఞుఁడను.