ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

71


పాత్రము, 2 దండము, 3 పాదరక్షలు. ఈ మూఁటియందును మూఁడు విశేషములు కలవు. భోజన పాత్రము కోరిన భోజన పదార్థములనిచ్చును. దండమువలన కోరిన ద్రవ్యము లభించును. పాదరక్షలను తొడిగినయెడల ఆకాశపథమున స్వేచ్చా విహారమును చేయవచ్చును! ఇట్టి వస్తువులకై పోరాడువారు పుత్రకుని మధ్యవర్తిగ నేర్పఱుచుకొనిరి. రాక్షస పుత్రులు పరుగెత్త వలసినదనియు, ఎవ్వఁడు నిర్ణీతస్థలముచేరునో వానికి ఈ మూడు ద్రవ్యము లీయఁబడు ననియుఁ బుత్రకుఁడు నిర్ణయించెను. వారందుకు నంగీకరించి పరువెత్తసాగిరి. అటువారిని పరువెత్త నిచ్చి యిటు పుత్రకుఁ డా పాదరక్షలను ధరించి మిగిలిన రెండు ద్రవ్యములను తీసికొని యెగిరి యాకాశమార్గమున ఆ కార్షికా పురికిఁ బోయెను. అచ్చటి రాజు మహేంద్రవర్మ. ఆతనికి పాటలియను కూఁతురుకలదు. ఆమె యుక్తవయస్కురాలై వివాహమునకు సిద్ధముగనున్న దని విని పుత్రకుఁ డొకనాఁడు ఆకాశమార్గమున నామె మందిరముఁ జేరెను. ఆమెయు నతని యమానుషశ క్తి, కచ్చెరువంది అతనిని వరించెను. కాని యా సమాచారము రాజునకుఁ దెలిసిన నాతఁడు పుత్రకుని వధించు ననియెంచి వారిరువురును, అచ్చట నుండి ఆకాశ మార్గమున వెడలిపోయి యొక పట్టణమును నిర్మించి, తమ యిద్దఱిపేళ్లును కలిపి దానికి 'పాటలీపుత్ర' మని పేరు పెట్టిరఁట, ఈ కథ బృహత్కథయను గ్రంథమునందున్నది.

ఇట్లీ గ్రామముయొక్క యుత్పత్తిని గుఱించి పెక్కుగాథలు గలవు. ఇఁక వీనిని విడిచి చరిత్రభాగమునకు వత్తము.