ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

చంద్రగుప్త చక్రవర్తి


చరిత్రకారులు కాలస్థల నిర్ణయముతో సమకాలిక చరిత్ర విషయములను వ్రాసియుంచుటయే. కాని హిందూమహా యుగము నందలి చరిత్రాంశముల కాలనిర్ణయ మిట్టిది కాదు. ఇందలి ప్రతివిషయిక కాలనిర్ణయము సంశయాస్పదమే. ప్రతి విషయమును గుఱించియు అభిప్రాయ భేదములు తండోప తండములుకలవు. ఋగ్వేద మెప్పుడు రచింపఁబడెననిన ప్రశ్నకు నొక్కఁ డైదువేల యేండ్ల క్రిందననియు మఱియొకఁడు ఏడువేలేండ్ల క్రిందననియు, నింకొకఁడు పదివేలేండ్ల క్రిందననియుఁ బ్రత్యుత్తరము లిచ్చెదరు. ఇదమిత్థమని చెప్పుటకు దగిన సాధనములు లేవు. ఇట్లే ఉపసిషత్తుల కాలమును గుఱించియు మహాభాష్య రచనాకాలమును గుఱించియు శంకరాచార్యుని యవతార సమయమును గుఱించియు వాద ప్రతివాదములును గలవు. పై కారణములచే హిందూ మహాయుగము నిశ్చితకాల జ్ఞానాభావ మను అంధకారముచే నిండియున్నది. ఇట్టి మహాంధకార మధ్యమున చంద్రగుప్త కాలనిర్ణయమను నొక చిన్న దీపము గ్రీకు చరిత్రకారుల సాయముచే వెలుగు చున్నందున దానిని నాధారముఁ జేసికొని అందుకు ముందు వెనుక జరిగిన చరిత్రాంశముల కాలము పండితులు నిశ్చయించుచున్నారు.

కావున కాలనిర్ణయము లన్నింటికిని ఆధారభూతమైన చంద్రగుప్త కాలనిర్ణయమెట్లు చేయఁబడెనో, అది యెంతవఱకు నమ్మఁదగినదో మన మాలోచింప వలెను,