ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడవ ప్రకరణము

27


నిలిచి చంద్రగుప్తున కాతిధ్యమిప్పించి, కుశలప్రశ్న రాఁగనే నందతిరస్కారాది విషయములనెల్ల వెల్లడి చేసి యతని సాహాయ్యము వేడెను.

అందుపై నిందుశర్మ తాను క్షపణకవేషమును దాల్చి నందమంత్రులకు తనయెడ స్నేహవిశ్వాసములు పుట్టునట్లుగ నటించుచు గట్టితనముగల నమ్మకమైన శిష్యులను చారులుగ నియమించి తనకుఁ దెలిసిన వర్తమానములెల్లఁ జాణక్యునకుఁ దెల్పుచు దేశకాలపాత్రములకుఁ దగినయట్టి పనులను సల్పుచు జంద్రగుప్తునకు తోడ్పడుటకు నంగీకరించెను.

నందసంహారము

పిదప చాణక్య చంద్రగుప్తులు పర్వతరాజు నగరునకుఁ బోయిరి. పర్వత రాజ్యమునకు తక్షశిల రాజధానియని కొందఱనుచున్నారు. కాని రాజునకు సింహళ దేశాధిపుఁడనియుఁ బేరుండుటంబట్టి సిమ్లాయను పురియం దతఁడుండుట కలదు కాఁబోలు. చాణక్యుఁడు పర్వతరాజు సన్నిధిఁజేరి చంద్రగుప్తుని యొక్కయుఁ దనయొక్కయుఁ బూనికలను దెలియఁ జెప్పె. పర్వతరాజునకును మగధరాజునకును బద్ధవైరముకలదు. కాని యతఁడు వంచకుఁడు, మిత్రునివలె నభినయించువాఁడు. దండయాత్రకుఁ దగుపాటి సమయము నెదురుజూచు చున్నవాఁడు. చాణక్య చంద్రగుప్తుల వ్యాజమునఁ దన రాష్ట్రమును వృద్ధిఁ బొందించు కొనఁదగిన యదను రాఁజూచి స్వబలమును శత్రు బలమును ఆలోచించుచు నిశ్చిత ప్రత్యుత్తరంబీయ కుండెను.