ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4]

రెండవ ప్రకరణము

25


క్షత్రియుఁడను చున్నవి. ముద్రారాక్షసమున విష్ణుగుప్త విరాధ గుప్తులు బ్రాహ్మణులు, బలగుప్తుఁడు క్షత్రియుఁడు. కావున చంద్రగుప్తుఁ డెవఁడు? తరువాతి కాలములో గుప్తనామము వైశ్యుల బిరుదాయెను.

అన్ని కథలను ఆలోచించి చూడ చంద్రగుప్తుడు మురయను స్త్రీకి గుమారుఁడనియు చిన్ననాఁడె సపత్నులగు శత్రువులచేఁ బీడింపఁబడి స్వగ్రామము విడిచి దూరదేశమునకుఁ బాఱిపోయెననియు నచ్చట చాణక్యుఁడను బ్రాహ్మణుని ఆశ్రయించి యతని కుటిలనీతి సాహాయ్యముచే నందుల సంహరించి రాజ్యమును సంపాదించె ననియుఁ గానవచ్చుచున్నవి. చంద్రగుప్తుఁడు మొదట నందుల సంహరించి మగధ మాక్రమించుకొనెనో లేక గ్రీకుల వెడలఁగొట్టి పంజాబును వశపఱచుకొనెనో నిశ్చయముగఁ జెప్పుటకు చరిత్ర సాధనము లేవియును లేవు. అతని జీవితములో నాతఁడు చేసిన ముఖ్య దిగ్విజయములు రెండు : ఒకటి మగధము నాక్రమించుకొనుట, రెండవది గ్రీకుల నోడించుట. మొదటిది మన పురాణాధులలోను ముఖ్యముగా ముద్రారాక్షసమను నాటకములోను వర్ణింపఁబడి యున్నది. రెండవ సంగతి యగు గ్రీకుల పరాభవమును గుఱించిన చరిత్రము వారి గ్రంథముల వలననే తెలిసికొనవలసి యున్నది. ఈ చరిత్రాంశములు వేరువేరుగ రెండు ప్రకరణములలో రచియింపఁబడును.