ఈ పుట ఆమోదించబడ్డది

ఇంకొక విచిత్రమైనకధ. గాంధితాత 12 ఏళ్ళవాడై వుండగా ఆయన అన్నగారు ఊళ్లో 25 రూపాయలదాకా చిల్లరబాకీలు చేశారు. కాని తండ్రికి తెలియకుండా తీర్చే ఉపాయం తోచలేదు అతనికి. అన్నదమ్ములు ఇద్దరూ కూడబలుకుకొని, ఏలాగైతేనేం ఒక నిర్ణయానికి వచ్చారు. అన్నగారిచేతిని బంగారం మురుగు ఉంది. దాన్న్ని కొంచెం నరికించి బాకీ తీర్చుదామనుకున్నారు. గాంధితాత ఈ పనిచేశాడేకాని గుండె దడదడా కొట్టుకుంటూనే ఉన్నది. తండ్రిగారు తన్ను కొడతారనీకాదు, కొరతను వేస్తారనీకాదు. గాంధిగారితండ్రి పిల్లలు తప్పుచేస్తే తను బాధపడేవారు; చేతులతో తల ఊరక బాదుకునేవారు. అలాంటప్పుడు ఈ తప్పు తెలిస్తే తండ్రిగారు ఎంత బాధపడతారు! తన్ను శిక్షించితే ఫర్వాలేదుకాని, తండ్రిగారు భాధపడతారుకదా. ఇక జన్మజన్మానికి మళ్ళీ దొంగతనం చేయగూడదని మన తాతయ్యచెంపలు వేసుకొన్నాడు. ఐనా ఆయనబాధ పోలేదు. చేసినపని తండ్రిగారితో చెప్పితీరాలనుకొన్నాడు. ఎలా చెప్పటం? ఈ మాట వింటే ఆయన మనస్సు ఎంత నొచ్చుకుంటుంది? ఒక వేళ చెప్పినా దానికితగ్గశిక్ష వేయడేమో? తాతయ్య మనస్సు వెనక్కూ ముందుకూ గుంజింది. జరిగింది చెప్పివేస్తేనేకాని పాపం పోదనుకొన్నాడు తాతయ్య.