ఈ పుట ఆమోదించబడ్డది

గంటింది. దెబ్బలభయం మూలకంగా ఏపనిచెయ్యాలన్నా భయమే. అదీకాక ఏపనిచేసినా దెబ్బలే తగులుతున్నప్పుడు మంచిపనులేవో, చెడ్డపనులేవో తెలుసు కోవటం ఎలా? అందుచేత నాకు మంచీ చెడూ తెలుసుకునేశక్తిపోయింది. నేను సాధువునయాను. నా మెత్తతనం చూసి కొందరు నన్ను మొద్దురాముడనేవాళ్లు.

ఇంక నాకు పెద్దచదువులు చెప్పటం మానాన్నవల్ల కాలేదు. అందుచేత నన్ను ఒకబడిలో వేశారు.

నన్ను ఒకటోక్లాసులో చేర్చుకున్నారు. మా క్లాసులోకల్లా నేనే పొడుగు. వయసులోకూడా నేనే అందరికన్నా పెద్ద. అందుచేత మిగిలినవాళ్లకెవరికీ తెలియని విద్య ఒకటి నాకుతెలుసు. అదేమిటంటే, చచ్చినా నోరు విప్పకపోవటం. నన్ను కొట్టినప్పుడల్లా పెద్దవాళ్లు, "నోరు మూసుకో, వెధవా! నోరుమూసుకో!" అనేవాళ్లు.

వాళ్ళ ఉద్దేశం నేను పైకి ఏడవరాదనో, మాట్లాడరాదనో నాకు తెలియదు. నేనుమాత్రం నోరు మూసుకోవటం నేర్చుకున్నా.

ఒకరోజు సాయంకాలం, క్లాసులో మా మేష్టారు పిల్లకాయల్ని, "ఏం కధ చెప్పమన్నారు?" అని అడిగారు. పిల్లకాయలెవరూ మాట్లాడలేదు. నా పక్కన్న ఉన్న పిల్లవాడు నా చెవిలో, మాయలేడి కథ చెప్పమని అడుగు", అని రహస్యంగా ఊదాడు. "మేష్టారూ, మాయలేడి కధ చెప్పండి," అన్నాను. ఎందుకోగాని పిల్లకాయలంతా గొల్లున నవ్వారు.

మేష్టారికళ్ళు చింతనిప్పులల్లే అయాయి. ఆయనపళ్లు పటపటా కొరుకుతూ అంబశక్తికి మల్లే ఒక్కొక్క అడుగే వేసుకుంటూ, చేతిలో బెత్తం ఊపుతూ,