ఈ పుట ఆమోదించబడ్డది

10

చలిజ్వరము


2-వ పటములో పైకి, క్రిందికి ఎక్కుచు దిగుచు నున్నట్లు గీయబడిన గీటు జ్వరముయొక్క హెచ్చు తగ్గులను తెలియజేయును. ఈగీటు, క్రిందికి దిగు సమయమున జ్వరము తగ్గుచున్నట్లును, గీటుపైకి ఎక్కుతున్న సమయమున జ్వరము హెచ్చుచున్నట్లు ఎంచవలెను. ఈపటములో 96, 97, 98, మొదలగు సంఖ్యలు శరీరముయొక్క వేడి యెన్ని డిగ్రీలు ఉన్నదో తెలుపు సంఖ్యలు. ఈ పటములో పైభాగము ఉన్న 1, 2, 3 మొదలగు అంకెలు తేదీలను తెలియజేయును. ' ఉ ' అనునది ఉదయమును ' సా ' అనునది సాయంకాలమును తెలియజేయును.

శరీరముయొక్క వేడిమి 100 లేక 101 డిగ్రీల వరకు ఉండిన కొంచెము జ్వరము తగిలినట్లు ఎంచుదుము. ఈవేడిమి 103 లేక 104 వరకు ఉండిన హెచ్చు జ్వరమనియు 106 లేక అంతకంటె హెచ్చుగ నుండిన విపరీత జ్వరమనియు చెప్పుదుము. శరీరము యొక్క వేడి 97 డిగ్రీల వరకు దిగిన యెడల దేహము మిక్కిలి చల్లగా నున్నదనియు 96 లేక 95 డిగ్రీలకు దిగినయెడల మిక్కిలి శీతలముగ నున్నదనియు చెప్పుదుము. జ్వరము 107 డిగ్రీలకుమించి పోయినను శీతలము 95 డిగ్రీలకంటె దిగిపోయినను జీవింఛుట దుర్లభము.