ఈ పుట ఆమోదించబడ్డది

కోటఁ గూల్చుటకు మొగలాయీల యారంభము. ఘోరయుద్ధము. కోమటి చెలువలు సయితము వైరులను బురు జెక్కనీయక పోరిరి. వెలమలు తెలగాలు బలిజెలు ఆయా బురుజులందు వైరులం జొరనీయక ప్రాణాంతము పోరాడిరి. పరాసులు ఈ బొబ్బిలి గడ్డలోని వీరుల పరాక్రమమునకు ఆశ్చర్యపడిరి, పలువురు మడిసిరి, అవశిష్టులు బురుజులం బట్టిరి.

ఈ సమయాన రంగరాయని తమ్ముడు వెంగళరాయఁడు కోట వెలువడి మొగలాయీలతో పోరి మడిసెను. ఇంతలో నిట మొగలాయీలును కోటను పలు పడగొట్టిరి. వారు లోనజొత్తు రనియు, శేషించియున్న పురుషులు మడిసిన యనంతరము ఆవైరులవలన తమకు మానరక్షకు లుండ రనియు, తలంచి, ఒక్కుమ్మడి వెలమదొరసానులు (పెండ్లికొమారితలును) తెలఁగాస్త్రీలు లోనగు ఘోషావర్ణముల మానవతులు వారి వరవుడులును కోటలోని యాఁడుఁబురుగెల్ల ఆబాలావృద్ధము పొడుచుకొని చచ్చిరి, తమ భర్తలచే నిహత లయిరి, చిచ్చుల జొచ్చిరి. కుమారులు తల్లులం జంపిరి, శిశువులను తండ్రులు కెడపిరి.

ఇట్లు గోహారయిన వెంటనే రంగారావు కోట వెలువడి మొగలాయి డేరాల మీఁదికి పోయి దుమికి, వీరలోకభయంకరముగా పోరి, జీవముతో వైరులకు పట్టువడక, సంధి కొడంబడక, అవయవములు ఆయుధహతులచే లుప్తములు కాఁగా కాఁగా సూర్యోదయ సమయమున వీరస్వర్గము నలంకరించెను.

ఈతనికుమారుని శిశువును చినవేంకటరాయని పినతల్లికడకు సామర్లకోటకు కొనిపోవుచు దాది యీ మొగలాయీలకు పట్టువడెను. బుస్సీదొర ఆశిశువును తగిన రక్షకపరివార మిచ్చి సామర్లకోటకు పంపెను.

ఈవృత్తాంత మెల్ల తెలియుడు రాజాము ఠాణాలో నున్న తాండ్ర పాపారాయఁడు రంగారాయని బావ, తనదివాను మిరియాలసీతన్నతోఁ గూడ, బొబ్బిలికి వచ్చి రాత్రిడేరాలో నిద్రితుని విజయరామరాజును నిద్ర లేపి, బొబ్బిలిరాణి మల్లమ్మదేవి పలికిన శాపముప్రకారము చిత్రవథ గావించి, తాను పొడుచుకొని చచ్చెను.

పిమ్మట సామర్లకోట నీలాద్రిరావు చినవేంకటరాయని నైజాముగారి దర్శనమునకుం గొనిపోయెను. ఈ లోపల ఉత్తరసర్కారు ఇంగ్లీషువారి ఏలుబడి లోనికి వచ్చినందున నైజామువారి సిఫారసుచేతను ధర్మ్యమగుటచేతను మదరాసు గవర్నమెంటు వారు బొబ్బిలి సంస్థానమును చినవేంకటరాయని వారికి జమీనుగా నొసంగిరి.

_____________