పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

భాగ్యగుణాలన్నీ ఆమె దైవ మాతృత్వాన్నిబట్టి సిద్ధించినవే. ఈ విషయాన్ని కొంత సవిస్తరంగా విచారించి చూద్దాం.

మరియ దేవమాత కావాలి గనుకనే నిష్కళంకంగా జన్మించింది. పరమ పవిత్రుడైన దేవుడు ఈ మరియద్వారా పాపపు నరజాతిని సమీపింపబోతున్నాడు. అతన్ని మన మానుష కుటుంబంలో ప్రవేశపెట్టబోయే తల్లీ పవిత్రురాలై యుండాలి. సూర్యుడు భూమిమీద పడేట్లయితే ఆ భూమిని చేరకముందే నేలమీద తాను పడబోయేచోటిని కాల్చివేస్తాడు. అలాగే దేవుడుకూడ తాను మానవసమాజంలోకి దిగిరాకముందే, ఏ వ్యక్తిద్వారా అలా దిగిరానున్నాడో ఆ వ్యక్తిని తన ప్రేమాగ్నితో కాల్చి పునీతం జేసాడు. అందువలననే ఆమె నిష్కళంకగా జన్మించింది. నిష్కల్మషుడైన దేవునికి పుట్టువు ఈయడం కోసం మరియ నిష్కల్మషగా ఉద్భవించింది.
మరియ నిత్యకన్య అన్నాం. దేనికి? తన పూర్ణ హృదయాన్ని ప్రభువుకే సమర్పించుకోవడం కోసం. కన్యమరియ తన హృదయాన్ని దేవుడైన తన కుమారునికే అర్పించుకుంది. మరో కుమారుడు ఆమెకు పుట్టనూలేదు, ఆ తల్లి ప్రేమలో పాలుపంచుకోనూలేదు. కనుక ఆమె కన్యాత్వం గూడ దైవమాతృత్వం కోసమే.
మరియ సహరక్షకి అన్నాం. ఆమె దేవమాత కనుకనే సహరక్షకి ఐంది. దేవుని కుమారుని కని అతనికి మానుష దేహం ఇచ్చింది. ఈ దేహాన్నే క్రీస్తు సిలువమీద బలిగా అర్పిస్తాడు. అనగా ఆమె క్రీస్తుకు బలివస్తువును అందించింది. క్రీస్తును బలిమూర్తిగా సిద్ధం చేసింది. అటుపిమ్మట మరియ సిలువచెంత నిలుచుండి బాధననుభవిస్తూ క్రీస్తును అర్పించింది. క్రీస్తు స్వీయార్పణంతో తన ఆత్మార్పణను కూడా ఐక్యం చేసింది. ఈ సన్నివేశంలో సిలువచెంత నిలిచిన మరియ మానవులందరికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక, ఆమె సహకారం ద్వారా క్రీస్తు రక్షణం మరింతగా మానవులనుండి పట్టే రక్షణమైంది. మానవుడ్డి మానవుడే రక్షించుకోవడం దైవప్రణాళిక అన్నాంగదా! ఈలా మరియ దేవమాత కనుకనే మనకు సహరక్షకి కాగలిగింది.
క్రీస్తు ఉత్తానమై మోక్షరోహణం చేసాడు. క్రీస్తు రక్షణకార్యంలో పాల్గొనిన రక్షణమాతకుగూడ ఉత్థాపనం లభించింది. ఉత్తానక్రీస్తు మనకు వరప్రసాదం ఆర్ధించి పెట్టాడు. ఆ వరప్రసాదాన్ని రక్షణమాత మనకు పంచిపెడుతూంటుంది. ఆమె వరప్రసాధాలమాత, క్రీస్తుతో పాటు ఆమెకూడ నిత్యం మనకోసం మనవి చేస్తుంటుంది. క్రీస్తుకు భౌతిక మాతయైన మరియు క్రీస్తు దేహమైన శ్రీసభకు జ్ఞానమాత ఔతుంది. ఆమె రెండవయేవ. జీవమిచ్చే యేవ. కనుక మరియు దైవమాతృత్వమే ఆమె ఉత్తాపనానికీ, వరప్రసాద ప్రదానానికీ, జ్ఞానమాతృత్వానికీ కారణం అని చెప్పాలి.