పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్ధనా భావాలు

1. సంయమనం

పౌలు తన లేఖల్లో భార్యాభర్తలకు సంయమనాన్ని బోధించాడు. కాలం చివరకు వచ్చిందిగనుక భార్య కలిగిన వాళ్లుకూడ భార్యలేనట్లుగా జీవించాలి అన్నాడు-1కొ 7,29. ప్రభువు రెండవ రాకడను మనస్సులో పెట్టుకొని అతడీలా వ్రాసాడు. ఈ లోక విషయాలూ, వాటితోపాటు వివాహంకూడా, ప్రభు రాకడకు తావీయాలి. అనగా లైంగిక జీవితమే ప్రధానం కాదని భావం. మరో తావులో పౌలు, ప్రార్ధనంచేసికొని భగవత్సాక్షాత్కారం కలిగించుకోవడం కోసం భార్యాభర్తలు కొంతకాలంపాటు ఒకరినొకరు సమీపించకుండా వుండడం మంచిదనికూడ సూచించాడు-1కొ7,5, ఇక్కడ లైంగికక్రియ చెడ్డదని కాదుగాని, భగవత్సాన్నిధ్యాన్ని కలిగించుకోవడంకోసం దాన్ని కొంతకాలం విసర్జించమన్నాడు. భార్యాభర్తలు లైంగిక విషయాల్లో సంయమనాన్ని పాటించాలి అనడానికి ఈ ఉదాహరణలు చాలు. ఉపవాసం చేసిన దేహం ఆరోగ్యంతో పనిచేస్తుంది. సంయమనానికి అలవాటుపడిన స్త్రీపురుషులు లైంగికక్రియలోని విలువను ఉదాత్తతను అధికంగా గుర్తిస్తారు. పైగా లైంగికక్రియ, లైంగికసుఖమే వివాహజీవితానికి పరమావధి అని బోధించే వెర్రివేదం నిలువజాలదని కూడ దంపతులు ఈ సంయమనంద్వారా తేల్చి చూపవచ్చు.

2. తిమోతి

తిమోతి పౌలు శిష్యుడు. పౌలు గతించిన తరువాత అతడు ప్రారంభించిన ప్రేషితకార్యాన్ని కొనసాగించిన ప్రేషితోత్తముడు. ఈ తిమోతి అమ్మమ్మ పేరు లోయి. ఆమె తిమోతి బాలుడుగా వున్నపుడే అతన్ని భక్తిమార్గంలో తీర్చిదిద్దింది. అతన్ని ఒడిలో కూర్చుండబెట్టుకొని వేదగ్రంథం చదివించింది. ప్రార్ధనం చేయడం నేర్పించింది-2తిమో 3,15, ఈలా కుటుంబంలోని పెద్దవాళ్ళవలన తిమోతికి చిన్ననాడే బైబులు గ్రంథంతో పరిచయం గలిగింది. తరువాత తిమోతి పెరిగి పెద్దవాడై చాలయేండ్ల గతించాక పౌలు అతనికి జాబు వ్రాస్తూ "నీవు చిన్ననాడే అలవాటుచేసికొన్న బైబులు పఠనాన్ని అశ్రద్ధ చేయవద్దు సుమా" అని హెచ్చరించాడు -1తిమొు 4, 13. మన కుటుంబం జపాల్లోకూడ బైబులు చదువుకొని ప్రార్ధనం చేసికొంటే ఎంత బాగుంటుంది! తిమోతిలాగ మన పిల్లలుకూడ చిన్ననాటినుండే బైబులు పఠనానికీ బైబులు ప్రార్థనకీ అభ్యాసపడితే యెంత ముచ్చటగా వుంటుంది!