పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/298

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరికొన్ని సమాజ మంతటి కొరకు గాక, పరిమిత వ్యక్తుల కొరకు ఉద్దేశింపబడ్డాయి. వివాహ జీవితము మఠశ్రేష్టత్వము, గురుత్వము మొదలైనవి ఈలాంటివి. వివాహ జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు, వాళ్ళిద్దరూ కలసి బిడ్డలకూ వరప్రసాద కారకులౌతారు. మఠ శ్రేష్ఠులదారా మఠవాసులకు అనేక వరప్రసాదాలు లభిస్తాయి. గురువు ద్వారా విశ్వాసులకు పెక్కువరప్రసాదాలు సిద్ధిస్తాయి.

3. క్రియా నిర్వహణ వరప్రసాదం

పవిత్రీకరణ వరప్రసాదం మన ఉనికికి, సహాయక వరప్రసాదం మన కార్యాలకు దివ్యత్వమిస్తాయని చెప్పాం. కనుక సహాయక వరప్రసాదం మనం ఆయా దివ్యకార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది, ఈ సహాయక వరప్రసాదంతో మనం సహకరిస్తే ఆయాసత్కార్యాలను చేసి ముగిస్తాం. సహకరింపకపోతే ఆ కార్యాలు ఆలాగే కుంటుపడిపోతాయి. కాబట్టి ఈ సహాయక వరప్రసాదంలో రెండు మెట్లుంటాయి. మొదటి మెట్టని క్రియా సమర్థక వరప్రసాదం అంటాం. ఈ మెట్టులో సహాయక వరప్రసాదం మనకు పుణ్యకార్యాన్ని చేయగలిగే సామర్థ్యం ఇస్తుంది. రెండవ మొట్టను క్రియానిర్వహణ వరప్రసాదం అంటాం. ఈ మెట్టులో పై సామర్ధ్యాన్ని సద్వినియోగ పరచుకొని పుణ్యకార్యంచేసి ముగిస్తాం. ఈ రీతిగా మన తోడ్పాటు వలన క్రియా సమర్థక వరప్రసాదం క్రియా నిర్వహణ వరప్రసాదంగా మారిపోతుంది.

ఓ వుదాహరణం చూద్దాం. డమస్కు త్రోవలో పయనమై పోతువున్న సౌలుని క్రీస్తు ప్రబోధించాడు, "సౌలూ! ఎందుకు నన్ను హింసిస్తున్నావు?” అని అడిగాడు. సౌలు విషయం గ్రహించాడు. ఇది మొదటిమెట్టు. అతడు గుండె బండ చేసికోలేదు. పరివర్తనం చెంది క్రీస్తుకు నచ్చిన శిష్యుడయ్యాడు. ఇది రెండవమెట్టు. ఈలాగే తన్ను శత్రువులకు పట్టీయవచ్చే యూదానుకూడ క్రీస్తు ప్రబోధించాడు. "మిత్రుడా! మనుష్యకుమారుని ముద్దుతో శత్రువులకు పట్టీయ వచ్చావా" అని హెచ్చరించాడు. యూదాకు అర్థమైంది. ఇది మొదటి మెట్టు, యూదా ఈ క్రియా సమర్థక వరప్రసాదంతో సహకరించనేలేదు. తన పాపకార్యాన్నుండి వైదొలగలేదు. అంచేత ఇక్కడ క్రియానిర్వహణ వరప్రసాదం లేనేలేదు.

మన జీవితంలో కూడ ఓ పుణ్యకార్యాన్ని చేయాలనో ఓ పాపకార్యాన్నుండి వైదొలగాలనో బలమైన కోరిక కలుగుతూంటుంది, ఇది ఓ ప్రబోధం, ఓ అంతర్వాణి. ఇదే క్రియా సమర్థక వరప్రసాదం. ఇట్టి పట్టుల్లో మనం అంతర్వాణితో సహకరించి ఆత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి, అలా నడచుకొంటే ఆ ప్రబోధమే క్రియా నిర్వహణ వరప్రసాదమౌతుంది. ఆలా నడుచుకోకపోతే వరప్రసాదాన్ని వ్యర్థపరచినవాళ్ళ మౌతాం.

ఈలా వ్యర్థపచవద్దని నూత్నవేదం చాలా తావుల్లో హెచ్చరిస్తుంది. సైఫను చనిపోతూ యూదుల నాయకులను "మీరు హృదయాలు రాయి చేసికొన్నారు. పరిశుద్దాత్మను