పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కార్యాలు చేయలేదు. అది స్వయంగా చేయగలిగింది ప్రాకృతిక కార్యాలు మాత్రమే. కాని వరప్రసాదం ఈ యాత్మను తన చేతులలోనికి తీసికొని మెట్ల నెక్కించుకొని పోతుంది. ఈలా తీసికొని పోవడమే ఉద్ధరణం. అనగా పుణ్యకార్యాలను ఆచరించేలా చేయడం. పవిత్రీకరణ వరప్రసాదం మన ఉనికిని ప్రాకృతిక దశ నుండి ఆధ్యాత్మిక దశకు కొనివస్తుంది. ఉద్ధరణ వరప్రసాదం మన క్రియలను పాకృతిక దశనుండి ఆధ్యాత్మిక దశకు కొనివస్తుంది.

మనం సత్కార్యాలు చేయాలంటే ఉద్ధరణ వరప్రసాదం అవసరం. కాని తొలినాళ్ళల్లోకి క్రైస్తవులు ఈలా అవసరమా అని సందేహించారు. పేలేజియనులు అనబడే శాఖవాళ్ళు సత్కార్యాలు చేయడానికి ఉద్ధరణ వరప్రసాదం అవసరం లేదని వాదించారు. సెమిపెలేజియనులు అనబడే శాఖవాళ్లు సత్కార్యాలు ప్రారంభించాలంటే ఉద్దరణ వరప్రసాదం అవసరం లేదు గాని వాటిని కొనసాగించాలంటే అవసరం అని వాదించారు. మహా మనీషియైన అగస్టీను జీవితాంతం వరకూ ఈ రెండు శాఖలవాళ్ళతో పోట్లాడి వాళ్ళ నోళ్ళు మూయించాడు. సత్కార్యాలు ఆరంభించాలన్నా కొనసాగించాలన్నా ఉద్ధరణ వరప్రసాదం అవసరమని శ్రీసభ బోధిస్తుంది.

కైసరియా ఫిలిప్పి చెంత క్రీస్తు "నన్ను గూర్చి మీ యభిప్రాయం ఏమిట"ని శిష్యులను ప్రశ్నించాడు. పేత్రు "నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువవు" అని జవాబిచ్చాడు. క్రీస్తు సంతోషించి "ఈ సత్యం నీకు మనుష్యమాత్రుల వలనగాదు, పరలోకంలోని తండ్రి వలన తెలిసింది" అని పేత్రుని మెచ్చుకొన్నాడు - మత్త 16,16. ఇక్కడ విశ్వాసం అనే సత్కార్యం ప్రస్తావించ బడింది. దివ్యవిశ్వాసం దేవుని వద్ద నుండేగాని అభింపదు. అందుకే పౌలు కూడ ఆత్మ అనుగ్రహం లేందే మనంతట మనం "యేసు ప్రభువు" అని పల్మలేం అన్నాడు–1కొ 12,3.

మరో తావులో ప్రభువు "పిత ఆకర్షించందే ఎవరూ నా వద్దకు రాలేరు" అన్నాడు యోహా 6, 43. మన క్రీస్తుజీవితమూ, ఆధ్యాత్మిక జీవితమూ దేవుని కార్యం, అందుకే పౌలు కూడా "ఏ దేవుడు మీయందు రక్షణకార్యం ప్రారంభించాడో ఆ దేవుడే దాన్ని ముగింపునకు గొనివస్తాడు" అని వ్రాసాడు—ఫిలి 1,6.

ఈ దివ్యగ్రంథ వాక్యాలను బట్టి మన చేత దివ్యకార్యాలను చేయించేవాడు దేవుడు లేక దేవుని వరప్రసాదం అని అర్థం చేసికోవాలి. మన పనులను ప్రాకృతికావస్థ నుండి దివ్యదశకు లేపుకొని పోయేదే ఉద్దరణ వరప్రసాదం.

పశుపక్ష్యాదులకు ఆత్మలేదు. కావున దివ్యత్వం లేదు. నరులకు దివ్యత్వం వందిగాని చాలమంది ప్రపంచ వ్యామోహాల్లో మునిగితేలుతూ ఆ సత్యాన్ని గమనింపనే గమనింపరు. ఇక, అపాత్రుల మైనను మనకు జ్ఞానస్నానం ద్వారా దివ్యత్వం లభించింది. కాని ఈ దివ్యత్వాన్ని పొందినంక గూడ మనం పాకృతిక కార్యాల్లోనే కాలం గడుపుతూంటాం.