పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుండిపోయిన యోసేపుని పూర్తిగా మరచిపోయాడు. కొంతకాలమయ్యాక ఫరో రాజుకుగూడ కలలు వచ్చాయి. కాని యెవరు ఆ కలల భావాన్ని వివరించి చెప్పలేక పోయారు. అప్పడు పానీయవాహకునికి యోసేపు గుర్తుకి వచ్చాడు. తనకు మేలు చేసిన యోసేపును మరచి పోయినందున అతడు పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళి చెరలోనున్న హీబ్రూ పడుచువాడు ఓ మారు తన కలకు అర్థం చెప్పాడనీ, ఫరో కలలకుగూడ వివరం చెప్పగలడని విన్నవించాడు. అతని కృతజ్ఞత పండిందో అన్నట్లు ఫరోరాజు యోసేపని చెరనుండి విడిపించాడు- ఆది 4, 8-13.

3. సౌలు కుమారుడైన యోనాతాను దావీదునకు ఇష్టుడు. సౌలు యోనాతాను గిల్బోవా యుద్ధంలో మరణించారు. సౌలుకు మారుగా దావీదు రాజయ్యాడు. యోనా తానునకు మెపిబోసెతు అనే కొడుకుండేవాడు. అతడు అవిటికాలివాడు. దావీదు తన్నెక్కడ చంపివేస్తాడో అని మెపిబోసెతు భయపడుతున్నాడు. కాని దావీదు అతన్ని తన సమక్షానికి పిలిపించి అభయమిచ్చాడు. “నీ తండ్రి యోనాతానును స్మరించుకొని నేను నీకు దయజూపుతాను. నీ వికమీదట రోజు నా సరసన కూర్చుండి భోజనం చేయవచ్చు" అని చెప్పాడు. ఆ మాటలకు మెపిబోసెతు విస్తుపోయాడు. "ప్రభూ! ఈ దాసునిమీద ఎంత ఆదరం జూపించావు! నేనెంత నా బ్రతుకెంత? ఓ చచ్చిన కుక్కలాంటి వాడ్డిగదా!" అని తన కృతజ్ఞత తెలుపుకొన్నాడు. - 2 సమూ 9,6-8.

4. ప్రభువు మగ్డలీన మరియనుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టాడు. మరియ కృతజ్ఞతాభావంతో ప్రభువు శిష్యురాలైంది. ఆమె పుణ్యస్త్రీలతోజేరి క్రీస్తువెంట వెళూండేది. అతని అవసరాలను తీరుస్తుండేది — లూకా 8,8.

5. ఓ మారు యేసు పదిమంది కుష్టరోగులకు వ్యాధి నయం జేసాడు. కాని వాళ్ళల్లో ఒక్కడు మాత్రం తిరిగివచ్చి ప్రభువుకి కృతజ్ఞత తెలుపుకొన్నాడు. అప్పడు ప్రభువు "పదిమందికీ కుష్ట నయమైందికదా, మిగిలిన తొమ్మిది మంది యేరీ?" అని అడిగాడు. నరులు స్వార్థపరులు. వాళ్లల్లో కృతజ్ఞతాభావం అరుదుగాగాని కన్పించదు - లూకా 17,17.

22. భక్తుల హృదయం

పసిబిడ్డ తల్లి కంటిపెట్టుకొని ఉన్నట్లుగానే భక్తుడు భగవంతునికి అంటిపెట్టుకొని ఉంటాడు. అతని హృదయం భగవంతునిమీద లగ్నమౌతుంది. ఆ ప్రభుని తలంచుకొని ద్రవించి పోతుంది. భగవంతుడు అతన్ని కరుణతో జూస్తాడు. దీవిస్తాడు. దానితో భక్తనికి • జన్మ తరిస్తుంది.