పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/156

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యాజకత్వాన్ని అణచివేయకూడదు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా వీళ్లుకూడ ఆ ప్రభువు యాజకత్వంలోను, ప్రవక్తృత్వంలోను, రాజత్వంలోను పాలుపొందుతారు. గురువులకంటే భిన్నమైన పద్ధతిలో వీళ్లుకూడ ఈ మూడు రంగాల్లో సేవలు చేస్తారు.

1. గృహస్టులు యాజకులుగా వ్యవహరిస్తూ గురువులతోపాటు తాముకూడ పూజబలిని సమర్పిస్తారు. వాళ్లు తమ కుటుంబజీవితాన్నీ లోకంలో తాముచేసే కృషినీ తమ కష్టసుఖాలనూ గురువు సమర్పించే క్రీస్తు బలితో చేర్చి పరలోక పితకు అర్పిస్తారు. దీనిద్వారా వీళ్ళ లౌకిక జీవితం పవిత్రమాతుంది. దేవునికి మహిమ చేకూరుతుంది.

2. గృహస్తులు ప్రవక్తలుగా వ్యవహరిస్తారు. అనగా దైవరాజ్యాన్ని బోధిస్తారు. వీళ్లు మొదట తమ ఆదర్శవంతమైన జీవితంద్వారానే దైవరాజ్యాన్ని బోధించాలి. అటుతర్వాత వాక్యబోధకూడ చేస్తారు. కానీ వీళ్లు ప్రధానంగా తమకుటుంబం, వృత్తి, లౌకికరంగం మొదలైన వాటిద్వారానే క్రీస్తుని బోధించాలి. ఈ బోధను సంతృప్తికరంగా నిర్వహించడానికి వీళ్ళకు దైవశాస్తాంశాల్లో తర్ఫీదు అవసరం. ఇంకా విజ్ఞానవరం ఆత్మానుగ్రహం మొదలైనవికూడ అవసరం.

3. గృహసులు రాజులుగా, అనగా నాయకులుగా వ్యవహరిస్తారు. వీళ్ళ నాయకత్వం ప్రధానంగా లౌకికరంగంలో వుంటుంది. వివిధ వృత్తులు ఆర్థిక సాంఘిక రంగాలు సంస్కృతి అభివృద్ధి కార్యక్రమాలు జాతీయాంతార్టీతీయ సంఘటనలు శాస్త్రరంగం సమాచార సాధనాలు మొదలైన నానా లౌకిక కార్యాల్లో వీళ్లు నాయకత్వం నెరపాలి. ఈ లౌకిక రంగాన్ని దైవసాన్నిధ్యంతో నింపి అది క్రీస్తువల్ల ప్రభావితమయ్యేలా చేయాలి. ఈలా గృహస్థలు కూడ దైవరాజ్యాన్ని వ్యాప్తిచేయాలి. న్యాయం, శాంతి, ప్రేమ, సత్యం, పవిత్రత, వరప్రసాదం మొదలైన దివ్యగుణాలతో గూడిన దైవరాజ్యాన్ని వాళ్ళ కూడ వ్యాప్తి చేయాలి.

ఈలా వాటికన్ సభ గృహస్తుల అంతస్తును పూర్తిగా పునరుద్ధరించింది. ఈ సభ జరిగి నలభై యేండ్లయినా దీని బోధలు మన దేశంలో నేటికీ ప్రచారం కాలేదు. అందువల్ల మనదేశంలో ఇప్పడు కూడ గృహస్తులు ముందుకు వచ్చి తమ బాధ్యతను సంతృప్తికరంగా నిర్వహించలేకపోతున్నారు. వీళ్ళకు ఎంతో తర్ఫీదు అవసరం. మన గురువులు గృహసులకు తోడి పనివాళ్ళనుగా వాడుకోవాలి. గృహసులు కూడ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. గృహస్థల ప్రేషిత సేవ అనే రంగంలో మనం సాధించింది చాల తక్కువ. ఇంకా ఎంతో కృషి జరగాలి.