పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/121

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అర్థం చేసికొన్నాడు. ఇంకా, తిరుసభే దైవరాజ్యానికి మార్గమని కూడ తెలిసికొన్నాడు. కనుక తిరుసభను నిరాకరించడమంటే దైవరాజ్యాన్ని నిరాకరించడమేనని నమ్మాడు. యూదులూ అన్యజాతివాళ్ళూ తిరుసభలో చేరిందాకా దైవరాజ్యం పరిపూర్ణంగా రాదని విశ్వసించాడు. యూదులు క్రీస్తుని నిరాకరించడంవల్లనే తాను అన్యజాతుల వద్దకు వెళ్ళగలిగానని కూడ అర్థంజేసికొన్నాడు. పౌలు పరిచర్యవల్ల క్రైస్తవమతం ఒక్క యూదసమాజానికీ యెరూషలేము దేవాలయానికీ మాత్రమే పరిమితమై వుండక విశ్వవ్యాప్తమైన మతంగా తయారైంది.
ఇంతవరకు మనం చూచిన చరిత్రసారాంశమిది. ఆత్మ దిగిరాకముందు శిష్యులకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు, వాళ్లు మోక్షారోహణం చేసిన క్రీస్తు రెండవసారి వేంచేసి వస్తాడన్న నమ్మకంతోనే వున్నారు. ఆత్మదిగివచ్చాక వాళ్లు మెస్సీయా కాలం వచ్చిందనీ తాము క్రీస్తునిగూర్చి బోధించాలనీ గ్రహించారు. ఆ మీదట ఆత్మే తిరుసభను నడిపిస్తూ వచ్చింది. శిష్యులు మొదట యూదులు మాత్రమే క్రైస్తవ మతంలో చేరతారనుకొన్నారు. క్రమేణ అన్యజాతివాళ్ళుకూడ ఆ మతంలో చేరడం చూచారు. అంటియోకయలో మొదటిసారిగా తిరుసభ అన్యజాతులకుకూడ చెందింది అనే భావం గుర్తింపులోకి వచ్చింది. తిరుసభను యూదుల పరిధిలోనుండి తప్పించి విశ్వవ్యాప్తం చేసినవాడు పౌలు.

ప్రార్ధనా భావాలు

1. దేవుడు నిద్రిస్తూన్న ఆదాము ప్రక్కనుండి ఏవను పుట్టించాడు - ఆది 2,21-22. అలాగే సిలువపై నిద్రిస్తూన్న రెండవ ఆదామైన క్రీస్తు ప్రక్కనుండి తిరుసభ పుట్టుకవచ్చింది. క్రీస్తే తిరుసభ స్థాపకుడు.
2. రెండవ శతాబ్దంలో జీవించిన వేదశాస్త్రి ఇరెనేయస్ అపోస్తుల వారసుల జాబితాను తయారుచేసాడు. రోముకి మొదటి పీఠాధిపతి పేత్రు. లీనస్, అనంక్లిటస్, క్లెమెంట్, ఎవరెస్టస్, అలెగ్జాండర్, సిస్టస్, టెలెస్ఫోరస్, హిగీనస్, పయస్, అనిసీటస్, సోటెర్, ఎలుతేరస్ అనేవాళ్లు క్రమంగా అతనికి వారసులయ్యారు. కనుక ఇప్పటి మన తిరుసభ పేత్రు మొదలైన ఆదిమ ప్రేషితులతో సంబంధం కలది. ఈ సంబంధం అన్ని క్రైస్తవ శాఖలకూ లేదు.

3. దైవరాజ్యమూ తిరుసభా

పూర్వాధ్యాయంలో ఆదిమ శిష్యబృందం ఆత్మవలన ప్రబోధితమై తిరుసభగా ఏర్పడిన తీరును చూచాం. కాని ఈ తిరుసభకీ మనం గ్రంథారంభంలోనే పేర్కొన్న దైవరాజ్యానికీ సంబంధం ఏమిటి? ప్రపంచానికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించేది