పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండు దేవదూతల బొమ్మలుండేవి. ఈ బొమ్మల మధ్యవున్న ఖాళీస్థలంలో దేవుడు ప్రత్యక్షమై ఉండేవాడు. ఈ సాన్నిధ్యాన్నే హీబ్రూ భాషలో "షెకీనా" అన్నారు. ఈ మందసం మీదినుండి ప్రభువు యిస్రాయేలు ప్రజలకు తన చిత్తాన్నీ ఆజ్ఞలను తెలియజేసేవాడు - నిర్గ 25,22. యూదులు గుడారపు సాన్నిధ్యంకంటె ఈ మందసపు సాన్నిధ్యాన్ని ఘనంగా యెంచారు.

4. దేవళం. ప్రజలు ఎడారి ప్రయాణం ముగించుకొని యెరూషలేములో స్థిరపడిన పిదప సాలోమోను రాతిగుడిని కట్టించాడు. మందసాన్ని ఈ గుడిలో పదిలపరచాడు. అప్పడు దైవసాన్నిధ్యం దేవళంలోని పీఠంమీద నెలకొంది. ఆ సాన్నిధ్యం మిలమిలా మెరిసేది. ఆ వెలుగును భరించలేక యాజకులు పీఠం దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు - 1 రాజు 8, 10-11.
ఈలా దేవుడు పూర్వవేదంలో రకరకాల పరికరాల ద్వారా ప్రజలకు దర్శనమిచ్చేవాడు. ప్రజలు అతని సాన్నిధ్యాన్ని గుర్తించారు. అతడు తమతో వసించే దేవుడు - ఇమ్మానువేలు - అనుకొన్నారు. ఈ దేవుడు నూత్నవేద ప్రజలకుగూడ తన సాన్నిధ్యాన్ని ప్రసాదించాడు. నూత్నవేదంలో కూడ అతడు రకరకాల రూపాల్లో ప్రత్యక్షమౌతాడు. కాని ఈ సాక్షాత్కారాలన్నిటిలోను దివ్యసత్ర్పసాద సాక్షాత్కారం శ్రేష్టమైంది.
నూత్నవేదంలోని ఏ వాక్యంగూడ ప్రభువు దివ్య సత్ర్పసాద ప్రత్యక్షమై యున్నాడని నేరుగా నిరూపించదు. కాని పైన మనం పేర్కొన్న పూర్వవేద సాన్నిధ్యాన్ని బట్టీ, నూత్నవేదం దివ్యసత్ర్పసాదంపట్ల ప్రదర్శించే భక్తి భావాన్నిబట్టీ దానిలో ప్రభువు సాన్నిధ్యం వుందని అర్థం చేసికోవచ్చు. ఇక్కడ నూత్నవేదం దివ్యసత్ర్పసాదాన్ని గౌరవపూర్వకంగా పేర్కొనే సందర్భాలను మూడింటిని మాత్రం పరిశీలిద్దాం.
1. పౌలు కొరింతీయులను మందలించిన ఘట్టం. 1కొ 11, 20-34. తొలిరోజుల్లో క్రైస్తవులు ఆదివారం రాత్రి ఆరాధనకు హాజరయ్యేవాళ్ళు. ఈ సందర్భంలో మొదట మామూలు భోజనం భుజించేవాళ్లు. అటుపిమ్మట దివ్యసత్ర్పసాదాన్ని కూడ పుచ్చుకొనేవాళ్లు. ఈ తంతుకంతటికీ కలిపి "ప్రేమవిందు” లేక "అగపె" అని పేరు. ఇక ఈ మామూలు భోజనం భుజించేపుడు ఓ వైపు ధనవంతులు బాగా తిని త్రాగేవాళ్లు, మరోవైపు పేదలు ఆకలితో నకనకలాడుతుండేవాళ్లు. ఈలా సంపన్నులు తోడి పేదలను పట్టించుకోకుండా తమకు తాము హాయిగా తిని త్రాగడం సోదర ప్రేమకు విరుద్ధమైన పాపం అన్నాడు పౌలు. ఈలాంటి పాపపు హృదయంతోనే ఈ ధనవంతులు దివ్యసత్ర్పసాదాన్ని గూడ పుచ్చుకొనేవాళూ. పుచ్చుకొనేవాళ్లు, ఫలితంగా వాళ్లల్లో కొందరు జబ్బు పడ్డారు, కొందరు చనిపోయారుకూడ -11, 30. పౌలు భావాల ప్రకారం ఈ యనర్థం ఓ శిక్ష.