పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/268

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. ప్రార్ధనా భావాలు

1 ఈ కీర్తనకారుడు నిరాశావాది కాడు. దేవుని యందు గొప్ప నమ్మకం గలవాడు. దేవుని శాశ్వతత్వంతో పోలిస్తే మన జీవితం క్షణికమైంది. పాపం వలన మన ఆయుస్సు ఇంకా క్షీణించిపోతుంది. ఇది మన దౌర్భాగ్యం. కాని మనం పశ్చాత్తాపపడితే దేవుడు మన పాపాలను మన్నించి మనకు తన కృపను దయచేస్తాడు. ఆ కృపతో మనం పుణ్యకార్యాలు చేస్తాం. దానివలన మన స్వల్పకాలిక జీవితంగూడ ఫలభరిత మౌతుంది. మనకు అది చాలు,

2 మన జీవితాన్ని లాగే మన కాలాన్ని గూడ దేవుని నుండి అరువు తెచ్చుకొంటాం. అది దేవుడు మనకిచ్చే విలువైన కానుక, మనం దాన్ని సద్వినియోగం జేసికోవాలి. కొందరు అవివేకంతో కాలాన్ని దుర్వినియోగంజేస్తుంటారు. పాపకార్యాలతో భ్రష్టం జేస్తారు. ఇది తప్ప. ఈ కీర్తన దేవుడు మనకు దయచేసిన ఆయుస్సూ కాలమూ ఎంతో విలువైనవని నొక్కిచెప్తుంది.

3 పుణ్యకార్యాలతో మన స్వల్పకాల జీవితాన్నిఫలభరితం చేసికోవాలి. భక్తిగల జీవితం అన్నిటికంటె ముఖ్యమైంది. స్థనిస్లాస్ భక్తుడు బాల్యంలోనే చనిపోయాడు, కాని అతడు భక్తితో రోజులు గడిపి, స్వల్పకాలంలోనే దీర్ఘకాలం జీవించాడు. పాలు కాలాన్ని సద్వినియోగం చేసికొమ్మన్నాడు - ఎఫె 5, 16 సొలోమోను జ్ఞానగ్రంథం

"సజ్జనుడు స్వల్పకాలంలోనే సిద్ధిని పొంది
దీర్ఘకాలం జీవించినవా డయ్యాడు"
అని చెప్తుంది - 4, 13. ఈ యాశయాన్ని పాటిస్తే మన జీవితం ధన్యమౌతుంది.

4 ఈ కీర్తనలో ముఖ్యమైది 12వ చరణం. మన బ్రతుకు స్వల్పకాలికమైనదని గ్రహించి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మనజీవితానికి ఒక పథకమంటూ ఉండాలి. మామూలుగా మనం 65 ఏండ్లు బాగా పనిచేస్తాం. ఆ మీదట మరికొన్నేళ్లు బ్రతికినా ఆ కాలంలో ముఖ్యమైన పనులేమీ చేయలేం. ఇక, నా జీవితంలో ఈ 65 ఏండ్లల్లో యిప్పటికే యెన్నేళ్ళ గడిచిపోయాయి? ఈ కడచిపోయిన కాలంలో నేను ఎన్ని పుణ్యకార్యాలు సాధించాను? ఇంకా నాకు ఎన్నేళ్లు మిగిలివున్నాయి? ఆ మిగిలివున్న కాలంలో ఏమి సత్కార్యాలు చేయాలనుకొంటున్నాను? నేను దేవుడు నా కిచ్చిన కాలాన్ని అమూల్యమైన వరంగా గణిస్తున్నానా? దాన్ని సద్వినియోగం జేసుకొంటున్నానా? నాకు వట్టి ప్రాపంచిక దృష్టినా లేక ఆధ్యాత్మిక దృష్టికూడ ఉందా? 260