పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/209

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగేది. ఇప్పడు ఈ ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడం ద్వారా ఈ యనిత్యశిక్షను తొలగించుకోవచ్చు. ఇంకా, పాపరిహారం లభించాకగూడ దాని అవశేషాలు మిగిలివుంటాయని చెప్పాం, సృష్టివస్తువులకు అంటిపెట్టుకోవడం, చెడ్డను చేయాలని కోరుకోవడం, తన్నుతాను విపరీతంగా ప్రేమించుకోవడం మొదలైనవి ఈ యవశేషాలు. ప్రాయశ్చిత్తక్రియ ఈ యవశేషాలను తొలగించుకోవడానికి గూడా సాయపడుతుంది. తొలిరోజుల్లో పాపులు తపస్సు కాలమంతా ప్రాయశ్చిత్తం చెల్లించిన తర్వాతనే పెద్ద గురువారంనాడు తమపాపాలకు మన్నింపుపొందేవాళ్ళు కనుక పూర్వులు మొదట ప్రాయశ్చిత్తం చెల్లించి తర్వాత మన్నింపు పొందారు. కాని యిప్పడు పాపోచ్చారణంలో గురువు మొదట మన్నింపు దయచేస్తాడు. తర్వాతనే విశ్వాసులు ప్రాయశ్చిత్తం చెల్లిస్తారు. ఇది తేలికపని. కనుక ఈ కార్యాన్ని మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి.
ఓ చిన్న కుర్రవాడు తల్లి హెచ్చరించినా వినకుండా యింటిలోని బల్లను అటూయిటూ కదిలించి దానిమిూది అలంకరణవస్తువును క్రింద పడవేసాడు. అది ముక్కలు ముక్కలైంది. తల్లి పిల్లవాడి ఆగడానికి ఎంతో చింతించింది. కడన తానూ పిల్లవాడూ కలసి ఆ పగిలిపోయిన ముక్కలను ఏరి అవతల పారవేసి ఇల్ల శుభ్రం చేసికొన్నారు. పాపోచ్చారణంలో మనం చెల్లించే ప్రాయశ్చిత్తం కూడ ఈలాగే వుంటుంది. క్రీస్తు మన మానవ కుటుంబంలో పట్టి మనకోసం చనిపోయి మన పాపాలకు ఇదివరకే ప్రాయశ్చిత్తం చేసాడు. ఇప్పడు మన ప్రాయశ్చిత్తం దానంతట అది కాక, క్రీస్తు ప్రాయశ్చిత్తంతో కలసి పరిహారాన్ని సాధించి పెడుతుంది. ఆ ప్రభువు మన సహకారాన్ని కోరుకొంటాడు. కరుణతో మన ప్రాయశ్చిత్తాన్ని తనదానితోకలుపుకొని మనకు వరప్రసాదాన్ని దయచేస్తాడు.
ప్రాయశ్చిత్తాన్ని గూర్చి చెప్పేపడు ఒక్కసంగతిని గుర్తుంచుకోవాలి. అది నష్టపరిహారం చెల్లించడం. మనం ఇతరుల సొత్తు దొంగిలిస్తాం. అన్యాయంగా ఇతరులకు వస్తునష్టం కలిగిస్తాం. అలాంటప్పుడు మనం వాళ్ళ నష్టాన్ని తీర్చాలి. అలా తీర్చకపోతే మనకు చిత్తశుద్ధి వుందని రుజువుకాదు. జక్కయ ఇందుకు మంచి ఉదాహరణం - లూకా 19,8.

2. క్రీస్తు పరిహరంతో కలిసే మన పరిహారం

క్రీస్తు సిలువమిూద చనిపోయి మనపాపాలకు ప్రాయశ్చిత్తంచేసాడు. మనం చెల్లించే ప్రాయశ్చిత్తం ఈ క్రీస్తుప్రాయశ్చిత్తంతో కలసే పని చేస్తుంది అని చెప్పాం. పాపోచ్చారణంలో మనం దోషం చేసామని ఒప్పకొంటాంగదా? ఎప్పడుకూడా దోషానికి శిక్షననుభవించాలి. మనపుణ్యమాఅంటూ మన తరపున క్రీస్తుపూర్వమే శిక్షననుభవించాడు. ఇప్పడు మనం కూడ బుద్ధితెచ్చుకొని కొద్దిపాటి శిక్షనైనా అనుభవించడానికి సమ్మతిస్తాం.