పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/133

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. జ్ఞానస్నానం మనలను దత్తపుత్రులను చేస్తుంది

సమస్తజాతి జనులకూ పిత పుత్ర పవిత్రాత్మల నామంలోనికి జ్ఞానస్నాన మీయండని శిష్యులను ఆదేశించాడు ఉత్దాన క్రీస్తు - మత్త28, 19. ముగ్గురు దైవవ్యక్తుల "నామంలోనికి" జ్ఞానస్నానం పొందినవాళ్ళు ఆ దివ్యవ్యక్తులకు అంకితమౌతారు. ఆ దివ్యవ్యక్తుల దివ్యకుటుంబానికి చెందిపోతారు. ఇదే దత్తపుత్రత్వం.

క్రీస్తు తండ్రికి సహజపుత్రుడు. మనం అతనిలోనికి జ్ఞానస్నానం పొందినప్పడు ఆయన పుత్రత్వం మనమీద సోకి మనలను కూడ పుత్రులను చేస్తుంది. ఆయన ద్వారా ఆయన తండ్రికి మనం కూడ పుత్రులమౌతాం. క్రీస్తు తండ్రికి సహజపుత్రుడైతే మనం దత్తపత్రులమౌతాం - అంతే వ్యత్యాసం. ఇక, క్రీస్తుద్వారా మనలను తండ్రికి పుత్రులనుగా మార్చే వ్యక్తి పవిత్రాత్మ ఆ యాత్మ మన హృదయాల్లో వుండి మనం దేవుణ్ణి 'అబ్బా" - అనగా నాన్నా అని పిలిచేలా చేస్తుంది. మీరు దేవుని బిడ్డలుసుమా యని ఆ యాత్మ నిత్యం మన హృదయంలో ఘొషిస్తూంటుంది. పూర్వవేదంలోని యూదులు తాము దేవుని దాసులమనుకొన్నారు గాని బిడ్డలమనుకోలేదు. నూతనవేదంలో జ్ఞానస్నానం ద్వారా బిడ్డలమయ్యే భాగ్యం మనకు ప్రత్యేకంగా లభిస్తుంది. ఇక, దేవుని బిడ్డలకు దేవుని వారసం లభిస్తుంది. అదే మోక్షభాగ్యం. జ్ఞానస్నానం వల్ల క్రీస్తు మరణోత్దానాలలో పాలుపొందేవాళ్లు కడన ఆ క్రీస్తు వారసాన్ని కూడ పొందుతారు. - రోమా 8, 14-17.

దేవుని దత్తపుత్రులమైన మనం ఈ లోకంలో ఆ దేవుని జీవితమే జీవించాలి. దేవుని జీవితం ప్రధానంగా ప్రేమ జీవితం. అతడు ప్రేమమయుడు - 1యోహా 4,8. కనుకన దత్తపుత్రులమైన మనంకూడ ప్రేమజీవితం జీవించడం అలవాటు చేసికోవాలి. ఈ ప్రేమజీవితం దైవప్రేమ సోదరప్రేమ అనే రెండు రూపాల్లో వుంటుంది. ఇక, ఈ ప్రేమజీవితాన్ని గడిపే శక్తిని మనకు దయచేసేదికూడ పవిత్రాత్మే.

ఇక్కడే జ్ఞానస్నానానికీ ఆత్మకీ వుండే సంబంధాన్ని కూడ వివరించాలి. మనం జ్ఞానస్నానం ద్వారా ఆత్మను సమృద్ధిగా పొందుతాం. ఈ సంస్కారాన్ని పొందినప్పటినుండి ఆత్మ ఓ దేవాలయంలోలాగ మన హృదయంలో వసించడం మొదలు పెడుతుంది - 1 కొరి 6,19. మనలను దేవునిబిడ్డలనుగా మార్చి తన ప్రేరణతో నడిపిస్తూంటుంది - రోమా 8,14. మనకు తన ఫలాలను దయచేస్తుంది - గల 5,22. విశ్వాసం. నిరీక్షణం, దైవప్రేమ అనే దైవపుణ్యాలను ప్రసాదిస్తుంది. ఈ మూడింటిలో మళ్ళా ప్రేమ ముఖ్యమైంది. ఈ ప్రేమ దైవప్రేమ సోదర ప్రేమకూడ. ఆత్మ ఈ ప్రేమను మన హృదయాల్లో సమృద్ధిగా కుమ్మరిస్తుంది, బొక్కెనతో మొక్కకు నీళ్లు పోసినట్లుగా - రోమా 5,5. ఇంకా ఆత్మ