పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం జ్ఞానస్నాన సమయంలోనే ఈ యాత్మను పొందుతాం. ఈ జీవితయాత్రలో మనలను నడిపించేది ఆత్మే - రోమా 8,14. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను మనం సమృద్ధిగా పొందాలి. ఈ కడపటి దినాల్లో దేవుడు మనకిచ్చే గొప్ప దానం ఆత్మ

ప్రార్థనా భావాలు

1. ఆత్మ గొప్పవరం. క్రీస్తు ఈ వరాన్ని అందరికీ దయచేస్తాడు. నరులు ఒక్కొక్కరి ఆశనుబట్టీ యోగ్యతను బట్టీ క్రీస్తునుండి ఆత్మను పొందుతారు. ఆత్మ అనే వరం లోకాంతం వరకు నరులతోవుండి వారికి వూరటా నమ్మకమూ వెలుగూ దయచేస్తుంది. క్రీస్తునుండి మనం ఆత్మను పుష్కలంగా పొందాలి. ఓసారి పొందిన ఆత్మను భక్తి విశ్వాసాలతో నిలబెట్టుకోవాలి.

2. మనకు ఆత్మ అవసరం ఏమిటి? ఆత్మ లేకపోతే నష్టమేమిటి? ఆత్మ లేకపోతే దేవుడు మనకు దూరమౌతాడు. అతడుంటే దగ్గిరౌతాడు. ఆత్మ లేకపోతే క్రీస్తు కేవలం భూతకాలానికి చెందిన వాడౌతాడు. అతడుంటే క్రీస్తు వర్తమానానికి చెందినవాడౌతాడు.ఆత్మలేకపోతే సువిశేషం మృతాక్షర మౌతుంది. అతడుంటే అది జీవనదాయక సందేశ మౌతుంది.

ఆత్మ లేకపోతే తిరుసభ కేవలం అధికార మందిర మౌతుంది. అతడుంటే అది సేవాసంస్థ ఔతుంది.

ఆత్మ లేకపోతే మనం చేసే వేదబోధ కేవలం రాజకీయ ప్రచారమౌతుంది. అతడుంటే అది నూత్న పెంతెకోస్తు ఔతుంది.

ఆత్మ లేకపోతే అర్చనకాండ కేవలం క్రీస్తు మరణోత్థానాల స్మరణం మాత్రమే ఔతుంది. అతడుంటే అది వరప్రసాద సాధనమౌతుంది.

ఆత్మ లేకపోతే మన శరీరమే మన ఆత్మను జయిస్తుంది. అతడుంటే మన ఆత్మే మన శరీరాన్ని జయిస్తుంది.

ఆత్మ లేకపోతే ఈ లోకంలో కేవలం లౌకిక రాజ్యమే పెత్తనం జేస్తుంది.అతడుంటే ఈ పరలోకరాజ్మంగా మారిపోతుంది.

ఆత్మ మనకు నిత్యనూతనత్వాన్ని దయచేస్తుంది. ఆత్మతో జీవించేదే ఆధ్యాత్మిక జీవితం.