పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది

మనం స్వార్థబుద్ధితో క్రీస్తుని ప్రేమించం. కాని "క్రీస్తు మనలను ప్రేమించాడు. దేవునికి ప్రీతినిగూర్చే సువాసనతో గూడిన అర్పణంగాను బలిగాను తన్నతాను అర్పించుకొన్నాడు" - ఎఫె 5,2. అలా ఆత్మార్పణం కావించుకొన్న క్రీస్తు ప్రేమ మనలను నిర్బంధిస్తుంది - 2కొ 5, 14 ఆ ప్రభువుకి బదులుపేమ చూపించమని మనలను బలవంతం చేస్తుంది. తిరుహృదయ భక్తిద్వారా మనం ఈ బదులు ప్రేమను చూపించవచ్చు. తిరుహృదయమంటే దేవుని తరపునా మన తరపునాగూడ ప్రేమగాథ అని చెప్పాం.

శ్రీహృదయ భక్తిని ప్రదర్శించే మార్గాలు చాలావున్నాయి. క్రీస్తు ప్రేమను అంగీకరించి ఆ ప్రభువుకి ఆత్మ నివేదనం చేసికోవచ్చు. మన పాపాలకూ ఇతరుల పాపాలకూ గూడ పరిహారం చేయవచ్చు, శ్రీహృదయం పండుగను భక్తితో జరుపుకోవచ్చు మానవజాతినీ కుటుంబాలనూ దివ్యహృదయానికి సమర్పించుకోవచ్చు. తిరుహృదయం పటాన్ని ఇంటిలో నెలకొల్పుకొని పూజించుకోవచ్చు. ఈలాంటి భక్తి క్రియలను ఎవరికి నచ్చినరీతిలో వాళ్ళ ఆచరించవచ్చు. వీటిల్లో ముఖ్యమైన విషయమేమిటంటే, క్రీస్తు ప్రేమను గుర్తించి అతనికి బదులు ప్రేమ చూపడం.

ప్రార్ధనా భావాలు

1. దేవుని ప్రేమా, క్రీస్తు ఆర్ధించిన రక్షణమూ కూడ తిరుహృదయంలో ఇమిడివున్నాయి. క్రీస్తు హృదయాన్ని ప్రేమభావంతో పూజించి అతని ఆజ్ఞల ప్రకారం జీవించినపుడు మన క్రైస్తవ ధర్మాలన్నిటినీ నెరవేర్చినవాళ్ళమౌతాం. శ్రీహృదయ భక్తిలో క్రైస్తవ మతమంతా, క్రైస్తవ పరిపూర్ణత అంతా యిమిడివుంది. అలాంటి ఉత్తమ భక్తి విధానాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు.

2. నరులు కృతఘ్నులు. క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా మనం అతన్ని ప్రేమించం. కనుకనే ప్రభువు పునీత మర్గరీత మరియమ్మకు దర్శనమిచ్చినపుడు ఆమెతో "ఇదిగో ఈ హృదయం నరులను గాఢంగా ప్రేమించింది. నరులమీదగల అనురాగంచేత ఈ హృదయం దహించుకొనిపోతుంది. ఐనా ఈ ప్రేమకు బదులుగా చాలామంది నాకు నిందావమానాలే కలిగిస్తున్నారు" అని పలికాడు. ఈ వాక్యాలు నేడు మనకూ అక్షరాల వర్తిస్తాయి. కనుక మన పాపాలకు పరిహారం చేసికోవాలి. ప్రభువే స్వయంగా ఈ పరిహారాన్ని కోరాడు. “నులివెచ్చనితనంగల సోమరిపోతుల నుండి నేను పొందే నిందావమానాలకు నీవైనా పరిహారం చేయి" అని అతడు మర్గరీత మరియమ్మగారిని అడిగాడు.