పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/237

ఈ పుట ఆమోదించబడ్డది

2. క్రీస్తు మనకు జీవం

అనాది కాలంనుండీ అతనియందు జీవం వుంది - యోహా 1,4. తండ్రిలాగే కుమారుడుకూడ తనంతటతాను జీవం కలవాడు - 5,26. అతడు తన్ననుసరించేవాళ్ళకు జీవాన్నిస్తాడు. దాన్ని సమృద్ధిగా గూడ దయచేస్తాడు -10, 10. మనకు అతడే మార్గం, సత్యం, జీవం -14,6. అతన్ని అనుసరించే భక్తుడు చీకటిని తప్పించుకొని జీవమిచ్చే వెలుగులో నడుస్తాడు - 8, 12. అతడు మనకు జీవజలమిస్తాడు. ఆ జలం మనలో నిత్యజీవమిచ్చే నీటిబుగ్గ ఔతుంది - 4,14. అతడు మనకు జీవాహారం. ఆ యాహారాన్ని తిని మనం నిరంతరం జీవిస్తాం - 6,51. యోహాను సువిశేషంలోని పై వాక్యాలన్నీ క్రీస్తు మనకు జీవనదాయకుడని చెస్తాయి.

3. క్రీస్తు జీవంమీద అధికారం కలవాడు

క్రీస్తు తండ్రి ఆజ్ఞకు బద్దుడై గొర్రెల కొరకు ప్రాణాలను అర్పించాడు -యోహా 10,15. కాని ఎవడూ బలవంతంగా అతని ప్రాణాలను తీయలేదు. అతడు తనంతట తానే తన ప్రాణాన్ని ధారపోసాడు. ఈ హక్కు అతనికి తండ్రినుండే లభించింది - 10,18. ఉత్థానానంతరం క్రీస్తు జీవమిచ్చే ఆత్మ అయ్యాడు - 1కొ 15,45. దేవుడు తన్ను కలిగించినపుడు మొదటి ఆదాము తన కొరకు తాను జీవాన్ని పొందాడు. దీనికి భిన్నంగా రెండవ ఆదాము మన కొరకు జీవాన్నిస్తాడు. మృతులలోనుండి లేచిన క్రీస్తు జీవానికి కర్త - అ,చ. 3,15, ఈ జీవాధిపతిని గూర్చి ప్రజలకు బోధించడం తొలినాటి శిష్యుల పూచీ - అ,చ. 5,20. ఈ వాక్యాలన్నిటిని బట్టి క్రీస్తు కేవలం జీవమిచ్చేవాడు మాత్రమే కాదు, జీవానికి అధిపతి అని కూడ అర్థం చేసికోవాలి.

4. మనకు జీవించడమంటే క్రీస్తుని జీవించడమే

జ్ఞానస్నానంలోనే క్రీస్తు మరణోత్ధానాలు మనమీద సోకుతాయి. ఈ పవిత్ర సంస్కారం వలన మనం పాపానికి చనిపోతాం, పుణ్యానికి ఉత్థానమౌతాం - రోమా 6,4 అటుపిమ్మట మనం పాపాన్ని విడనాడి దేవుని కొరకు జీవించాలి - 610-11 జ్ఞానస్నానం పొందిన క్రైస్తవుని జీవితం క్రీస్తుతోపాటు దేవునియందు గుప్తమైవుంటుంది - కొలో 3,3 అట్టి క్రైస్తవునిలో దేవుడు ఓ దేవాలయంలో లాగ వసిస్తూంటాడు - 1 కొ 6,19. అతడు దైవస్వభావంలో పాలుపొందుతాడు. అనగా దివ్యదౌతాడు - 1 పేత్రు 1,4, అటుపిమ్మట అతడు తన కొరకు కాక క్రీస్తు కొరకే జీవించాలి - 2కొ 5,15. సంగ్రహంగా జెప్పాలంటే క్రైస్తవునికి జీవించడమంటే క్రీస్తు జీవితం జీవించడమే ఔతుంది - ఫిలి 1,21. అలాకాకుండ అతడు తన సొంత జీవితం తాను జీవిస్తే అది పాపజీవితమే ఔతుంది.