పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది

4. క్రీస్తు జ్ఞానస్నానమూ, మన జ్ఞానస్నానమూ

మన జ్ఞానస్నానం క్రీస్తు జ్ఞానస్నానం నుండి గాక, అతని మరణోత్ధానాలనుండి ఫలితం సాధిస్తుంది. కాని క్రీస్తు సొంత జ్ఞానస్నానం అతని మరణోత్థానాలను సూచిస్తుందని చెప్పాం. అందువల్ల అతని జ్ఞానస్నానం పరోక్షంగా మన జ్ఞానస్నానంమీద సోకుతుంది. మన జ్ఞానస్నానంలో క్రీస్తు మరణోత్ధానాలు నూత్నీకరింపబడాలి — ఇది ముఖ్యాంశం. ఇది యేలాగో పరిశీలిద్దాం.

తొలిరోజుల్లో జ్ఞానస్నానం ఇప్పటిలాగ వుండేదికాదు. అప్పడు జ్ఞానస్నానం పొందేవాళ్ళను మడుగులోని నీళ్ళల్లో ముంచేవాళ్ళు. గ్రీకుభాషలో బాప్తిస్మం అంటే నీళ్ళల్లో ముంచడమని ముందే చెప్పాం. ఈ జ్ఞానస్నాన పద్ధతిలో మరణోత్ధానాల సంకేతం చక్కగా అన్వయించేది. చనిపోయిన క్రీస్తుని సమాధిలో పాతిపెట్టారు.అలాగే జ్ఞానస్నానం పొందే భక్తులుకూడ మడుగులోని నీళ్ళల్లో పాతిపెట్టబడతారు. క్రీస్తులాగే వాళ్ళుకూడ చనిపోతారు. ఈ చనిపోవడం భౌతికంగా గాదు, ఆధ్యాత్మికంగా.అనగా భక్తులు పాపానికి చనిపోతారు. ఈలా క్రీస్తు మరణం జ్ఞానస్నానం పొందే భక్తుల్లో నూతీకరింపబడుతుంది.

ఇక, క్రీస్తు సమాధిలోనుండి లేచాడు. అదే అతని ఉత్ధానం. అతడు సజీవుడయ్యాడు. అలాగే భక్తులుకూడ మడుగునుండి వెలుపలికి వస్తారు. ఇది క్రీస్తు ఉత్థానంలాంటిది. వాళ్ళ ఇంతకుముందు పాపానికి చనిపోయినట్లే ఇకమీద వరప్రసాదానికి జీవిస్తారు. ఇదే వాళ్ళ క్రొత్త జీవితం, వాళ్ళ సజీవులు కావడం.

ఈలా క్రీస్తు మరణోత్ధానాలు మన జ్ఞానస్నానంలో సాంకేతికంగా నెరవేరుతాయి. జ్ఞానస్నానం పొందినపుడు మనకు వరప్రసాదాన్ని సంపాదించి పెట్టేవి ఈ సంకేతాలే. పౌలు రోమీయులకు వ్రాస్తూ "మనం జ్ఞానస్నానంలో క్రీస్తు మరణంలో పాలుపొందుతూ అతనితోపాటు పాతిపెట్టబడుతున్నాం. అతని ఉత్థానంలోను పాలుపొందుతున్నాం" అని చెప్పాడు - 6,4.

ఈనాటి జ్ఞానస్నానంలో మడుగులో ముంచడం అనే పద్ధతి లేదు. ఐనా క్రీస్తు మరణోత్థానాలు అనే సంకేతాలు పాపానికి చనిపోయి క్రొత్తజీవితానికి ఉత్థానం కావడం అనే సంకేతాలూ, ఈనాటి జ్ఞానస్నానానికికూడ వర్తిస్తాయి. ఈ సంకేతాలు లేందే జ్ఞానస్నానం ఫలితం ఈయలేదు.

5. జ్ఞానస్నానమూ, ఆధ్యాత్మిక జీవితమూ

జ్ఞానస్నాన జీవితం జీవించగలిగితే చాలు మనం పవిత్రుల మౌతాం. పెద్దపెద్ద అర్చ్యశిషులుకూడ ఇంతకంటె ఎక్కువేమీ చేయలేదు. పవిత్ర జీవితమంటే