పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది

సత్ర్కియ క్రీస్తుని సమాధి చేయడమే. ఇంకా, యితడు “ధనికుడు". మత్తయి సువిశేషం ప్రచారంలోకి వచ్చిన క్రైస్తవ సమాజంలో చాలమంది ధనికులు కూడ వుండేవాళ్లు, మత్తయి గ్రంథంలో ధనాన్ని గూర్చి చాల అవలోకనాలు కన్పిస్తాయి.

యోసేపు ధైర్యంలో పిలాతు వద్దకు వెళ్ళి క్రీస్తు దేహాన్ని ఇప్పించమని అడిగాడు. పిలాతు ఆజ్ఞ ప్రకారమే రోమియులు క్రీస్తుని సిలువ వేసారు. కనుక శవాన్ని ఇప్పించమంటే అతనికి కోపం రావచ్చు. పైగా యూదనాయకులు క్రీస్తుకి శత్రువులు, అలాంటివాని శవాన్ని తీసికొని పాతిపెట్టడం ప్రమాదకరం. ఐనా యోసేపు సాహసంతో ఖనన క్రియకు పూనుకొన్నాడు. సైనికులు సిలువ మిూది నుండి మృతదేహాన్ని దింపి అతనికిచ్చారు. అతడు దాన్ని శుభ్రమైన నారబట్టలో చుట్టాడు. తన కొరకు తొలిపించుకొన్న క్రొత్త సమాధిలో పాతిపెట్టాడు. ఈ క్రియలన్నీ అతని ఆర్థిక స్తోమతకు తగినట్లుగా ఉదాత్తంగానే వున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా అతడు భక్తుడు. భక్తిభావంతోనే ప్రభువు మృతదేహానికి సేవలు చేసాడు. ఎప్పడు కూడ మన మంచితనాన్నీ భక్తినీ క్రియాపూర్వకంగా చూపాలి.

యోసేపూ తోడిభక్తులూ కలసి సమాధి ద్వారానికి అడ్డంగా రాతిబండను దొర్లించి వెడలిపోయారు. ఇద్దరు స్త్రీలు సమాధికెదురుగా జాగరణం చేస్తూ కూర్చున్నారు – 27,61. మృతుల కొరకు విలపించడం యూదుల సంప్రదాయం. కనుక ఇక్కడ వీళ్లు చనిపోయిన క్రీస్తు కొరకు ఏడుస్తూ కూర్చున్నారు అనుకోవాలి.

సమాధికి కావలి - 27,62-65

శత్రువులు క్రీస్తు సమాధికి కావలివారిని నియమించారు అనే సంఘటనం మత్తయి సువిశేషంలో మాత్రమే వస్తుంది - 27,62-65, ఈ గ్రంథం ప్రచారంలోకి వచ్చిన రోజుల్లో యూదులు క్రైస్తవులకు బద్ధశత్రువులుగా వుండేవాళ్లు, వాళ్లు శిష్యులే మిూ క్రీస్తు శవాన్ని సమాధినుండి ఎత్తుకొనిపోయారని దుష్ప్రచారం చేస్తుండేవాళ్లు, ఈ నీలివార్తలను ఖండించడానికే మత్తయి ఈ సంఘటనను తన గ్రంథంలో చేర్చాడు.

యోసేపు భక్తిభావంతో క్రీస్తు మృతదేహాన్ని రాతి సమాధిలో పాతిపెట్టించాడు. కాని యూదనాయకులు కుట్రబుద్ధితో క్రీస్తుదేహాన్ని సమాధిలో బంధించి వుంచాలను కొన్నారు. నరుల హృదయాలోచనలు ఎంత భిన్నంగా వుంటాయి!

శనివారం విశ్రాంతి దినమైనా యూదనాయకులు పిలాతు దగ్గరికి వెళ్లారు. ఇది విశ్రాంతి దినాన్ని గూర్చిన ఆజ్ఞలను విూరడమే. క్రీస్తు విశ్రాంతిదిన నియమాలను పాటించలేదని యూదులు అతని మిద తప్పు మోపారు, ఇప్పడు వాళ్లుకూడ అదే తప్ప చేసారు, క్రీస్తు చనిపోయిన పిదపకూడ అతని పేరును అణచివేయాలని వాళ్లు ఎన్ని పాట్ల పడ్డారు!