పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

4. మనుష్యావతారం నూత్న నిబంధనం లాంటిది

పూర్వవేదంలో దేవుడు యూదులతో నిబంధనంచేసికొన్నప్పడు, నిబంధన కార్యాన్ని ప్రారంభించింది దేవుడే. మనుష్యావతారంకూడ మళ్ళా ఓ నిబంధనంలాంటిది. ఇక్కడకూడా కార్యాన్ని ప్రారంభించింది, అనగా క్రీస్తుని పంపింది, తండ్రే.

మనుష్యావతారమంటే ఓ ప్రేమ సంఘటనం. నరుణ్ణి సందర్శించడానికి తండ్రి క్రీస్తుద్వారా పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చాడు. అతడు నరుడ్డి తన దగ్గరికి రమ్మని ఆహ్వానించాడు. తనతో మళ్ళా రాజీపడమని కోరాడు - 2 కొరి 5, 17. దేవుడైన తన కుమారుని ద్వారా నరులమైన మనకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తానని వాగ్దానం చేసాడు. నరావతారంనుండే మానవ రక్షణం ప్రారంభమైంది. ఈ రక్షణం తర్వాత సిలువమీద ముగుస్తుంది.

దేవుడు నరుల దగ్గరికి దిగివచ్చేదీ, నరులు దేవుని దగ్గరికి ఎక్కిపోయేదీకూడ క్రీస్తు ద్వారానే. అతడు మనకు నిచ్చెనలాంటివాడు. మన నరజాతికి ప్రతినిధి. నరులందరినీ తనలో ఇముడ్చుకొన్న విశ్వమానవుడు. పూర్వం దేవుని నుండి పెడమొగం పెట్టిన నరజాతి యిప్పడు క్రీస్తుద్వారా మళ్ళా దేవునివైపు తిరుగుతుంది.

ఆదాము పాపం ద్వారా నరులు దేవుని యింటినుండి వెళ్ళిపోయారు. కాని నరావతారమెత్తిన క్రీస్తుద్వారా మనం మళ్ళా దేవుని యింటిని చేరుకొంటాం. ఆ దివ్యధామంలో అడుగిడి తండ్రితో మళ్ళా నూత్ననిబంధన చేసికొంటాం. క్రీస్తుద్వారా ఈ నిబంధనం జరుగుతుంది. అతడు మరో మోషేలాగ మనలను తండ్రి యింటికి తోడ్కొని పోతాడు. ఆ తండ్రితో మనం నూత్ననిబంధనం చేసికొనేలా చేస్తాడు.

5. మనుష్యావతారం భావం

సుతుడు మనుష్యావతారమెత్తి నరశిశువుగా జన్మించడంలో చాల దైవరహస్యాలు ఇమిడివున్నాయి. వాటిల్లో కొన్నిటిని పరిశీలిద్దాం.

1. నరుడూ, దేవుడూ

క్రీస్తుశిశువులో మానవత్వమూ దైవత్వమూ ఐక్యమైయున్నాయి. అతడు ఎంతగా దేవుడో అంతగా నరుడుకూడ కనుక క్రీస్తు పాపంలో తప్పితే అన్ని విషయాల్లోను మనతో సరిసమానుడు అని చెప్తుంది హెబ్రేయులజాబు - 4,15. "సుతుడు మనుష్యావతార మెత్తినపుడు తాను పూర్వం ఎవరో అతడుగానే వుండిపోయాడు. ఐనా పూర్వం ఎవరు కాదో అతడుగా తయారయ్యాడు" అన్నారు పితృపాదులు. అనగా క్రీస్తు దేవుడుగావుండే