పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

తెలుసు, దుష్టుల మార్గం వినాశానికి నడిపిస్తుంది" అంటుంది మొదటి కీర్తన 6వ వచనం. కుమ్రాను భక్తులుకూడ జ్యోతిర్మార్గమూ తమోమార్గమూ అని రెండు త్రోవలు పేర్కొన్నారు.

విశాలమార్గం వినాశానికి చేరుస్తుంది. ఏమిటి ఈ మార్గం? ప్రపంచ సుఖభోగాలు, శిష్యుడికి ఈ త్రోవ తగదు.

ఇరుకైన మార్గం జీవానికి నడిపిస్తుంది. ఏమిటి ఈ మార్గం? ఆత్మనిగ్రహం, సిలువను మోయడం. శిష్యుడికి ఈ త్రోవ తగుతుంది. ఇక్కడ మార్గాలంటే బోధలు. శిష్యుడు క్రీస్తు బోధల ప్రకారం జీవించాలిగాని ప్రపంచ బోధల ప్రకారం కాదు - మత్త 7, 13-14

2. మంచి చెట్టు మంచి పండ్లనూ పాడుచెట్టు పాడుపండ్లనూ కాస్తాయి. ఉమ్మెత్త కాయలుకాస్తే అది పాడు చెట్టు. మామిడిపండ్లు కాస్తే అది మంచి చెట్టు, పండ్లనుబట్టి చెట్టును నిర్ణయించినట్లే క్రియలనుబట్టి నరుని నిర్ణయించాలి. శిష్యులు మంచి పనులు చేస్తూ మంచిపండ్లు పండే చెట్లలా వుండాలి - మత్త 7,20.

3. కొందరు ప్రభూ ప్రభూ అని దేవుణ్ణి సంభోధిస్తూంటారు. కాని వాళ్ళ దేవుని చిత్తాన్ని పాటించరు. తమ ఇష్టంవచ్చినట్లుగా ఏవేవో వెర్రిమొర్రి పనులు చేస్తారు. ఈలాంటివాళ్ళను ప్రభువు అంగీకరించడు. పైపెచ్చు వీళ్ళను దుప్రియలు చేసేవాళ్ళనుగా ఎంచుతాడు. కనుక శిష్యుడు దైవచిత్తం ప్రకారం జీవిస్తూండాలి - మత్త 7, 21-23,

4. ప్రభువు వాక్యాన్ని వింటేనే చాలదు. దాన్ని ప్రతిదినం జీవితంలో పాటించాలిగూడ, ఈలా పాటించినవాడు రాతిపునాదిమీద కట్టిన యిల్లలాగ సురక్షితంగా వుంటాడు. పాటించనివాడు ఇసుకపునాదిమీద కట్టిన ఇల్లులాగ కూలిపోతాడు - 7,24-27.

ఈలా రెండు మార్గాలు, మంచి చెట్టు, ఒట్టినే పెదవులతో ప్రభువా అని పల్కడం, రెండు యిండ్లు అనే యీ నాలు అంశాలుకూడ ఆచరణశుద్ధిని బోధించేవే. ఈ యాచరణ శుద్ధిని అలవర్చుకొన్నవాడే శిష్యుడు. క్రియాశుద్ధిలేనివాళ్ళు ప్రభువుకి ప్రియపడరు.

8.శిష్యధర్మమూ ఆచరణశుద్దీ

ఇక్కడ కొన్ని పర్యవసానాలను తిలకిద్దాం.

1. ప్రభువు దైవరాజ్యాన్ని గూర్చి బోధించాడు. తండ్రిని గూర్చి చెప్పాడు. పశ్చాత్తాపపడి పాపవిమోచనం పొందమన్నాడు. ప్రేమతో జీవించమన్నాడు. కాని ఆ ప్రభువు వట్టినోటిమాటలతో బోధించలేదు. తన బోధలను తానే ఆచరించి చూపించాడు. అపోస్తలుల చర్యల గ్రంథం "క్రీస్తు చేసిన పనులూ, చెప్పిన బోధలూ" అంటుంది - 1,1. ఇక్కడ క్రీస్తు చేసిన పనులు అంటే విశేషంగా అతని అద్భుతాలు. కాని శిష్యుల కాళ్ళు కడగడం, శత్రువులను క్షమించడం మొదలైన అతని ఆదర్శ క్రియలుకూడ ఈ