పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 279 P.pdf/77

ఈ పుట ఆమోదించబడ్డది

5. ఆవిభక్తహృదయం

పూర్వం గ్రీసు రోము రాజ్యాల్లో బానిసలుండేవాళ్లు, వాళ్ళు తాము ఏ యజమానునికి బానిసలో అతనికి మాత్రమే సేవలు చేయగలిగేవాళ్లు ఇంకో యజమానునికి ఊడిగంచేయలేకపోయేవాళ్ళు ఆలాగే శిష్యుడికి కూడ ఇద్దరు యజమానులు దొరకవచ్చు వాళ్లే ధనమూ దేవుడూను. కాని అతడు ధనాన్ని విడనాడి దేవునికిమాత్రమే పరిచారం చేయాలి. లేకపోతే ఐహిక వ్యామోహాల్లో తగులుకొని భ్రష్టుడై పోతాడు - మత్త 6, 24 ఈ సూత్రాన్ని పాటించనందున చాలమంది గోతిలో పడిపోయారు. అవివేకియైన ధనవంతుడు ఐహికవస్తులంపటత్వానికి చిక్కి నాశమైపోయాడు — లూకా 12, 18–21. శిష్యుడికీ ఇదేగతి పడుతుంది, ఇంకా మన సంపద ఇక్కడకాక పరలోకంలో వుండాలి. మన సంపద వున్నకాడనే మన హృదయంకూడ వుంటుంది. కనుక మన సంపద పరలోకంలోవుంటే మన హృదయంకూడ అక్కడే వుంటుంది. అనగా మన మనసు దేవునిమీద లగ్నం కావాలేగాని ఇహలోక వస్తువులమీద కాదు -6, 19-21. కనుక శిష్యుడు అవిభక్త హృదయంతో ఆప్రభువుని సేవించాలి, హృదయం ఆ ప్రభువమీద లగ్నంజేసికొనేవాడు ఇహలోక వ్యామోహాలకు లొంగడు.

6. చింతలూ వంతలూ జయించడం

ఆ ప్రభువు మన తండ్రి, మనం అతని బిడ్డలం. మనలను పోషించే భారం అతనిదే. కనుక మనం ఆందోళనం చెందకూడదు. పెద్దవరాన్ని ఇచ్చిన దేవుడు చిన్నవరాన్ని ఈయకపోడు. అతడు మనకు పెద్దవరమైన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని నిల్పుకొనే సాధనాలయిన కూడు గుడ్డా ఈయకుండా వుంటాడా? కనుక శిష్యులు ఏమితిందామా ఏమి కట్టుకొందామా అని ఆందోళన పడకూడదు. ఆకాశపక్షులను పోషించేవాడు అంతకంటె శ్రేష్టప్రాణులైన నరులను పోషించకుండా వుంటాడా? మత్త 6,26. పొలంలోని గడ్డిమొక్కలకు పూలు అనే దుస్తులు తొడిగినవాడు తన బిడ్డలమైన మనకు గుడ్డలనీయకుండా వుండడు కదా? -6, 28-30. ఆ తండ్రి అనుమతిలేనిదే ఓపిచ్చుక చావదు, ఓ తలవెండ్రుక ఊడదు. వీటికంటె మనం తప్పకుండ గొప్పవాళ్ళం, మరి మనకు కలవరపాటెందుకు? -10, 29-30 పైగా ఆందోళనంచెంది మన ఆయుస్సుని ఒకరోజుగాని కనీసం ఒక గంటగాని పెంచుకోగలమా? -6,27. కనుక శిష్యుడు ప్రభువుని నమ్ముకొని జీవిస్తూండాలి. ఒకోమారు దైవశాస్తాంశాలు నేర్చుకొని తెలివైనవాళ్ళమనుకొనే నరులకంటెగూడ పశుపక్ష్యాది అజ్ఞానప్రాణులకే దేవునిమీద ఎక్కువ నమ్మకం వుంటుంది. కనుక శిష్యుడు ఈ జంతుజలాన్ని అవలోకించి దేవునిమీద విశ్వాసం పెంపొందించుకోవాలి. అనవసరమైన ఆందోళననూ విచారాన్నీ విడనాడాలి.